శని చెడు ప్రభావం ఉండకూడదంటే.. శ్రీ మందేశ్వర దేవస్థానము సందర్శించాల్సిందే..
30 November 2022, 13:00 IST
- Sri Mandeswara Swamy Temple : ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని ప్రభావం తొలగించుకోవడానికి.. మందపల్లి శ్రీ మందేశ్వర దేవస్థానము సందర్శించుకోవాల్సిందే. ఈ ఆలయానికి ఎందుకు ప్రాముఖ్యతో ఉందో.. దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటో వంటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ మందేశ్వర దేవస్థానము
Sri Mandeswara Swamy Temple : ప్రతీ వ్యక్తికి తన జీవితములో సుఖ, దుఃఖములు.. లాభనష్టాలు సహజము. మానవ జన్మ ఎత్తిన ప్రతీ ప్రాణి ఈ రాశి చక్రమనే కాలకూటమి ప్రకారం.. వారి కర్మఫలము అనుభవించాలి. పుట్టిన రోజు, సమయాన్ని బట్టి వారి రాశి ఏర్పడుతుంది. అలా రాశుల ద్వారా వారికి గోచార స్థితి ఏర్పడుతుంది. ఏ వ్యక్తికైనా గోచారములో శని, గురుని గ్రహస్థితి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని గోచారమునందు 12-1-2 స్థానములయందు సంచరించినచో దానిని ఏలినాటి శని అంటారు.
ఉదాహరణకు శని ఇప్పుడు మకర రాశిలో ఉంటే.. కుంభరాశి మకరం 12వ స్థానం అవ్వడం వల్ల.. మకరానికి మకరం 1వ ఇల్లు అవుతుంది. దీనివలన ధనూరాశి వారికి మకరం 2 ఇల్లు అవుతుంది. ఈ మూడు రాశుల వారికి ఏలినాటి శని ఉన్నట్లు అర్థం. అలాగే గోచారములో శని 8వ స్థానములో ఉంటే.. అది అష్టమ శనిగా, 4వ స్థానములో ఉంటే అది అర్ధాష్టమ శనిగా జ్యోతిష్యశాస్త్రము చెప్తుందని.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ శని ప్రభావాల వలన ఆ రాశుల వారికి ప్రతీ పనియందు ఆలస్యము, ధన, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గొడవలు జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యశాస్త్రము చెప్తుంది.
ఇలాంటి పరిస్థితులు ప్రభావాల నుంచి.. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వారు.. అలాగే జాతకములో శని దోష స్థానమునందు ఉండి.. శని మహర్దశ అంతర్దశలో సంచరించేటటువంటి వారు వారి శని బాధలు తొలగించుకోవడానికి మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి క్షేత్ర దర్శనము, అభిషేకము చేసుకుంటే మంచిదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మందపల్లి శ్రీ మందేశ్వర దేవస్థానము మహత్మ్యము
పూర్వకాలము నందు మేరు పర్వతముతో స్పర్ధ వచ్చి.. అంతకంటే ఉన్నతముగా ఉండాలని భావించి.. వింధ్యాపర్వతము విపరీతముగా పెరగసాగెను. ఇలా వింధ్య పర్వతము మిక్కుటముగా పెరుగుతుండడంతో.. భారతవర్షమున ఉత్తర దక్షిణ భాగములయందు సూర్యకిరణ ప్రసారము చక్కగా ప్రసరించదని భయమేర్పిడింది. అప్పుడు దేవతలు, ఋషి పుంగవులు అగస్త్య భగవానుని వద్దకు వచ్చి.. వింధ్యపర్వతము పెరుగుదలను నిలపాలని ప్రార్థించారు. అప్పుడు ఆ లోపాముద్రాపతియగు అగస్త్య మహర్షి.. వేయి మంది మహర్షులతో, వివిధ పశు జాతులతో, బహు మృగ గణములతో వింధ్య పర్వతమునుచేరాడు.
అంతట ఆ పర్వతరాజు బహు ఋషిగణ సమేతుడగు అగస్త్య భగవానునికి సాష్టాంగ నమస్కారం చేసి.. ఆర్ఘ్యపాద్యాదులు నర్పించి అతిథి సత్కారాలతో సంతుష్టుని చేసెంది. అగస్త్యముని పుంగవుడు సంతుష్టాంతరంగుడై.. పర్వత శ్రేష్టుడా అంటూ వింధ్యుని ప్రశంసించి దేవ కార్యమును మనసు నందుంచుకొని ఇలా చెప్పాడు. హే! పర్వత శ్రేష్టుడా.. నేను మహా జ్ఞానులగు మహర్షులతో కలిసి దక్షిణ దిక్కునకు తీర్థయాత్రకై బయలుదేరాను. కాబట్టి నాకు మార్గమునిమ్ము. నేను తిరిగి ఉత్తర దిక్కునకు వచ్చే పర్యంతము నీవు పెరగకుండగా ఇలానే ఉండాలి. దీనికి భిన్నముగా చేయరాదని చెప్పగా ఆ పర్వత శ్రేష్టుడు సరేనని అలాగే ఉండిపోయాడు.
అగస్త్యమహర్షి.. ఋషులతో దక్షిణ దిక్కుకు వెళ్లిపోయాడు. అనంతరం క్రమముగా సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి.. సంవత్సరము సత్రయాగము చేయుటకు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులు మహా పాపులునగు అశ్వత్థుడు, పిప్పలుడు అను రాక్షసులు దేవలోకములో కూడా ప్రసిద్ధి చెందారు. వారిరువురిలో అశ్వత్థుడు రావిచెట్టు రూపములోనూ.. పిప్పలుడు బ్రాహ్మణరూపములో.. సమయం చూసుకుని.. యజ్ఞమును నాశన చేయాలని తలచారు. రావిచెట్టు రూపములోనున్న అశ్వత్థుడు.. ఆ వృక్షఛాయనాశ్రయించుటకు వచ్చిన బ్రాహ్మణులను తినేవాడు. పిప్పలుడు.. సామ వేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యగణంబులను భక్షించెవాడు.
రోజురోజుకి బ్రాహ్మణులు క్షీణిస్తున్నారని గమనించిన మహర్షులు.. గౌతమీ దక్షిణ తటమున నియత వ్రతుడై తపమును నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూసి ఈ ఘోరమగు రాక్షస కృత్యముల గురించి ఆయనకు నివేదించారు. ఈ రాక్షసులను వధించమని కోరారు. అప్పుడు శని ఋషులతో ఇలా చెప్పాడు. నేను ఇప్పుడు నియతవ్రతుడనై తపస్సు చేయుచున్నాను. నా తపస్సు పూర్తికాగానే రాక్షసుల నిరువురిని వధిస్తాను అని తెలిపాడు. అప్పుడు మహర్షులు మేము మా తపః ఫలితమును నీకిచ్చెదము. నీవు వెంటనే ఆ రాక్షసులను సంహరింపుమనిరి. అయితే రాక్షస సంహారము పూర్తి అయినట్లేనని శని.. ఋషులతో పలికి బ్రాహ్మణ వేషమును దాల్చి వృక్షరూపంలోనున్న అశ్వత్థుడు వద్దకు వెళ్లి ప్రదక్షిణములు చేశాడు. అశ్వత్థుడు.. ఈ శనిని మామూలు బ్రాహ్మణుడేనని తలచి అలవాటు చొప్పున మింగేశాడు.
అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి.. అతని పేగులను తెంచేశాడు. ఆ పాపాత్ముడగు రాక్షసుడు సూర్యపుత్రుడగు శనిచే క్షణమాత్రములో మహా వజ్రాహతు వలె భస్మీభూతుడాయెను. బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము నభ్యసించుటకు వచ్చిన బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా శని వెళ్లి.. అతనిని సంహరించాడు. ఆ ఇరువురు రాక్షసులను సంహరించిన శని ఇంకేమి చేయాలని ఋషులను అడగగా.. వారంతా శని ముందు సంతుష్టాంతరంగులై.. శనికి ఇవ్వవలసిన వరములిచ్చారు.
సంతుష్టుడై శని.. నా వారము రోజున (శనివారం) ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్థవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీడేరును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్థము ఈ శనైశ్చర తీర్థములలో ఎవరైతే స్నానము చేయుదురో.. వారి సమస్త కార్యములు నిర్విఘ్నముగా కొనసాగును.. శనివారము రోజున అశ్వత్థ ప్రదక్షిణములు చేసిన వారికి గ్రహపీడ కలుగదని హామీ ఇచ్చాడు. ఈ తీర్థము నందు అశ్వత్థతీర్థము, పిప్పలతీర్థము, సానుగ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్రిక తీర్థము, యగ్నిక తీర్థము, సాముగ తీర్థము వంటి మొదలైన పదునాలుగువేల నూట ఎనిమిది తీర్థములు ఉన్నాయని.. అక్కడ స్నానం చేయాలని సూచించారు.
శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వారికి.. సమస్త కోరికలు నెరవేరుతాయని.. తమ బాధ, ఇతర గ్రహపీడ కూడా ఉండదని మునులకు శని వరమిచ్చాడు. అంతట శనిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి.. శనేశ్వరుడని పేరు కూడా ఉంది. పిమ్మట ఈ మందేశ్వరునికి పక్కనే సప్తమాత్రుకలు వచ్చి.. శ్రీ పార్వతీదేవిని ప్రతిష్ఠించారు. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకటగు కర్కోటకుడను నాగు ఉంటాడు. అందుకే ఈశ్వరునికి నాగేశ్వరుడని పేరు వచ్చింది. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాలస్వామి మూర్తి ఉంటారు.
మొత్తము మీద ఒకే పెద్ద ప్రాకారము నందు.. వరుసగా ఐదు దేవాలయములు కలిగి.. భక్త జనాహ్లాదకరముగా ఈ ఆలయం ఉంటుంది. సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా.. అంత్యకాలములో మోక్షసామ్రాజ్యము నొందుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ మందపల్లి క్షేత్ర ప్రాంతమున పదునాలుగువేల నూట ఎనిమిది పుణ్యతీర్థములు గలవు. వీటిలో ప్రధానమైనవి - అశ్వర్థ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్రిక తీర్థము, యాగ్నిక తీర్థము, సానుగ తీర్థము మొదలగునవి ముఖ్యమైనవి.