Sleeping Direction: నిద్రపోతున్నప్పుడు తలను ఏ దిశలో పెడుతున్నారు? వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వైపు పెట్టాలి?
27 November 2024, 18:30 IST
- Sleeping Direction: స్థలానికి, ఇంటికి వాస్తు చూసినట్లే, ఇంట్లో ఉండే వస్తువులకు చివరికి ఇంటిలో పడుకుని నిద్రపోయేందుకు కూడా వాస్తు శాస్త్రం వర్తిస్తుంది. కంటికి సుఖమైన నిద్ర కావాలంటే కచ్చితంగా ఈ సూత్రాలను ఫాలో అవ్వాల్సిందేనంటున్నారు నిపుణులు.
వాస్తు ప్రకారం పడుకునేటప్పుడు తల ఏ దిశగా పెట్టాలి
నిద్ర శరీరానికి అత్యంత కీలకమైనది. పగలంతా దైనందిక కార్యకలాపాల్లో అలసిపోయి రాత్రి నిద్రకు ఉపక్రమించిన తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టాలి. అలా సరిపడ నిద్రపోకపోతే శరీరానికి, మనస్సుకు అలసట తీరదు. వాస్తుకు వ్యతిరేకంగా నిద్రపోతే ప్రతికూల శక్తులు, పీడకలల ప్రభావానికి గురై ప్రశాంతంగా ఉండలేం.
వాస్తు ప్రకారం నిద్రపోకపోతే వచ్చే నష్టాలు:
నిద్రలేమి శరీరాన్ని నెమ్మెదిగా అలసత్వానికి గురి చేసి పనితీరులో ఆలస్యం, శక్తి లోపం ప్రతిబింబిస్తాయి. నిద్రలేకపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాకుండా సరైన నిద్రలేని వారు శక్తి కోల్పోవడం, నిర్ణయాలు తప్పుగా తీసుకోవడం, జీవితంలో వైఫల్యాలు ఎదుర్కోవడం, దు:ఖంగా అనిపిస్తుండటం వంటి భావనల్లో గడిపేస్తుంటారు. ఫలితంగా ఏ పనిలోనూ విజయం సాధించలేక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతారు.
ప్రశాంతమైన నిద్ర శరీరంతో పాటు మనస్సుకు కూడా బలం చేకూరుస్తుంది. గ్రోత్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. నూతన ఉత్తేజంతో పని చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఫలితంగా పూర్తి ఆరోగ్యం మెరగవుతుంది. వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే ఉత్తమం.
ఉత్తమ నిద్ర దిశలు:
- దక్షిణం: నిద్రపోతే తల దక్షిణం వైపున ఉండటం, పాదాలు ఉత్తరం వైపున ఉండటం వాస్తులో అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తారు. ఇది ఆరోగ్యాన్ని, శాంతిని, చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది. దక్షిణ దిశ వైపుగా పడుకోవడం అనేది మన శరీరానికి ఉత్తమమైన నిద్రను పొందే శక్తిని అందిస్తుంది.
- తూర్పు: తల తూర్పుకు పెట్టి నిద్రపోవడం వాస్తు ప్రకారం చూస్తే రెండో మంచి ఆప్షన్. ఇది మానసిక స్పష్టతను, శక్తిని, ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తుందని నమ్ముతారు. విద్యార్థులకు, ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయడానికి ఈ దిశ మంచిది.
- పశ్చిమం: తల పశ్చిమం వైపుకు ఉంచి నిద్రపోవడం పూర్తిగా దారుణమైన విషయం కాదు. కానీ, దక్షిణం వైపుకు లేదా తూర్పు వైపుకు తల పెట్టడం కంటే తక్కువ ఫలితాలను ఇస్తుంది. కాకపోతే చాలా అరుదుగా కొందరికి మాత్రం ప్రగతిని, సంపదను కూడా కురిపిస్తుంది.
బెడ్, గది ఏర్పాట్లు:
- బెడ్ స్థానం: నైరుతి (South-West) దిశలో బెడ్ రూం ఉంటే చాలా ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ స్థానం స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం, సంతోషం, సంపదను ప్రోత్సహిస్తుంది.
నిద్రపోయేందుకు ఎంచుకోకూడని దిశలు:
- ఉత్తరం: ఉత్తరం వైపుగా తల పెట్టి నిద్రపోవడం వాస్తు శాస్త్రంలో అత్యంత చెడ్డ విషయంగా భావిస్తారు. ఇది మానసిక ఆరోగ్యంపైన, శారీరక ఆరోగ్యంపైన దుష్ప్రభావం చూపించవచ్చు. ఉత్తర దిశలో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరంపై ప్రతికూలంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.
- ఈశాన్యం (North-East): ఈశాన్య దిశలో పడుకోవడం ముమ్మాటికీ చేయకూడని విషయం. ఇది మానసిక ఆందోళనను, నిద్రలేమిని కలిగిస్తుందని నమ్మకం.
- బీమ్ కింద నిద్రపోవడం: వాస్తు ప్రకారం, గదిలో ఉన్న బీమ్ కింద నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు. ఇది శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మనసులోనూ ఆందోళన కలిగిస్తుంది.
- కిటికీలు: మంచం పెట్టడానికి గదిలో కిటికీలు సరియైన రీతిలో ఉండాలి. ఉత్తర, తూర్పు వైపున ఉన్న కిటికీలు ఉత్తమమైనవి.
వాస్తు ప్రకారం నిద్రకు సంబంధించిన మరి కొన్ని సూచనలు:
- రంగులు: బెడ్ రూంలో సాఫ్ట్, మృదువైన రంగులు వాడటం మంచిది.
- లైటింగ్: గదిలో సాఫ్ట్ లైట్స్ వాడడం మంచిది. ఎక్కువ లైటింగ్ ఉన్న బల్బులు వాడటం వల్ల నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
- గాలి: గది సరిగా పశ్చిమ లేదా తూర్పు వైపుగా ఉంచడం వల్ల గదిలోకి శుభ్రమైన, తాజా గాలి ప్రసారం అవుతుంది.
- మలినాలు లేకపోవడం: గది నుండి అన్ని మలినాలను తొలగించడం ముఖ్యం. శుభ్రంగా ఉంచడం వాస్తు ప్రకారం నిద్రకు సహాయపడుతుంది.
(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)