Lord Hanuman: పెళ్లయిన బ్రహ్మచారి హనుమంతుడు, తెలంగాణాలో హనుమాన్ భార్యతో కలిసి ఉన్న ఆలయం
26 June 2024, 11:19 IST
- Lord Hanuman: హిందువుల ఆరాధ్య దైవం హనుమంతుడు. రాముని పట్ల అతనికి ఉన్న భక్తి అసమానమైనది. హనుమంతుడు బ్రహ్మచారి అని అంటారు. అయితే హనుమంతుడికి పెళ్లయింది అనే వాదన ఉంది.
హనుమంతుడి దేవాలయం
Lord Hanuman: హనుమంతుని గురించి చెప్పుకోకుండా రామాయణం సంపూర్ణం అవ్వదు. రాముని పట్ల హనుమంతుడికి ఉన్న భక్తి ఇంతా అంతా కాదు. జైశ్రీరామ్ మంత్రాన్ని జపిస్తే చాలు హనుమంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆంజనేయుడికి శ్రీరాముడి పట్ల గౌరవం, భక్తి తప్ప ఇంకేమీ కనిపించవు. అతడు నిత్యం శ్రీరాముని పేరును స్మరిస్తూ ధ్యానంలోనే ఉంటారు. రామాయణంలో హనుమంతుడి పాత్ర కీలకమైనది.
హనుమంతుడు బాల బ్రహ్మచారి
ఆంజనేయుడిని బాల బ్రహ్మచారి అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా చెప్పుకుంటారు. హనుమంతుడి పేరు చెబితే గుర్తొచ్చేది అసమానమైన భక్తి, అమితమైన బలం, ఆధ్యాత్మిక మార్గం. ఈ బ్రహ్మచారి జీవితంలో కూడా పెళ్లి అనే ఘట్టం ఉంది. దాని వెనుక ఒక కథ కూడా ఉంది.
హనుమంతుడు సూర్యుడి కథ అందరికీ తెలిసిందే. హనుమంతుడు ఆడుకుంటున్నప్పుడు సూర్యుణ్ణి ఒక పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరాడు. దేవతలు ఇంద్రుడు జోక్యం చేసుకొని సూర్యుడిని హనుమంతుడు మింగకుండా అడ్డుకున్నారు. ఇంద్రుడు హనుమంతుడిని తన వజ్రాయుధంతో కొట్టాడు. అది అతడిని భూమి పైకి పడగొట్టింది. దవడ మీద దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. దేవతలందరూ కలిసి తమ దైవిక శక్తులతో హనుమంతుడిని ఆశీర్వదించారు. అతడికి మరిన్ని శక్తులను అందించారు. ఈ సమయంలో సూర్యదేవుడు తన ఆశీర్వాదాన్ని అందించాడు.
ఈ ఘటన తర్వాత కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడు, సూర్యదేవుడి శిష్యుడిగా మారాడని అంటారు. సూర్యుడు హనుమంతుడికి తొమ్మిది రకాల విద్యలను బోధించే బాధ్యతను స్వీకరించాడు. అతనికి ఐదు విద్యలు సులువుగానే నేర్పాడు. చివరి 4 నేర్పేటప్పుడు ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే ఆ విద్యలను కేవలం వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే నేర్పించాలి.
హనుమంతుడు బ్రహ్మచారిగానే ఉండడానికి సిద్ధపడ్డాడు. కనుక ఏ అమ్మాయి ముందుకు వచ్చి హనుమంతుడిని వివాహం చేసుకోలేదు. అలాంటి సమయంలో సూర్య భగవానుడు హనుమంతుడికి ఒక ఆలోచనను చెప్పాడు. సన్యాసిగా మారిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. దానికి హనుమంతుడు కూడా ఒప్పుకున్నాడు.
హనుమంతుని భార్య ఈమె
పురాణాల ప్రకారం సూర్యదేవుడు తన కుమార్తె అయిన సువర్చలను హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు చెబుతారు. సువర్చల కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న అమ్మాయి. కేవలం వీరిద్దరికి వివాహం మాత్రమే జరిగింది. తర్వాత సువర్చల ధ్యానంలోకి వెళ్లిపోయింది. హనుమంతుడు తన జీవితాన్ని తాను కొనసాగించడం మొదలుపెట్టారు. వివాహం అవ్వడం వల్ల హనుమంతుడికి మిగతా నాలుగు విద్యలు నేర్పగలిగాడు సూర్యదేవుడు.
వివాహమైనా కూడా హనుమంతుడు పూర్తి బ్రహ్మచారిగానే ఉన్నాడు. సువర్చల ధ్యానం చేస్తూ గడిపింది. వీరిద్దరూ సాధారణ వైవాహిక అనుబంధాన్ని కొనసాగించలేదు. హనుమంతుడు తొమ్మిది విద్యలలో ప్రావీణ్యం సంపాదించాక... తన ఒంటరి జీవితాన్ని తానే గడిపాడు. మన దేశంలో హనుమంతుడు, అతని భార్య సువర్చల ఇద్దరూ కలిసి ఉన్న ఆలయం ఒకటే ఉంది. అది కూడా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. ఆ ఆలయం పేరు ‘దేవి సువర్చల ఆలయం’. ఈ ఆలయంలో హనుమంతుడు తన భార్య సువర్చలతో కలిసి కనిపిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువగానే ఉన్నారు.
టాపిక్