Ganga pushkaralu 2023: గంగా నది పుష్కరాలు తేదీలు, పుష్కర విశిష్టత ఇదే
06 April 2023, 10:37 IST
Ganga pushkaralu 2023: తేదీ 22 ఏప్రిల్ 2023 నుండి చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితము ఆధారంగా బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడం చేత గంగానదికి పుష్కరాలు ఏర్పడ్డాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గంగా పుష్కరాలు 2023: హరిద్వార్‌లో స్నానమాచరించేందుకు భక్తులు ఎక్కువగా వస్తారు (ఫైల్ ఫోటో)
Ganga pushkaralu 2023: గురువు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల గంగానదికి పుష్కరాలు వస్తాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుష్కరము అంటే పోషించేది అని అర్థము. పుష పుష్టో అనే దాతువు నుండి పుష్కరము ఏర్పడినది. పురాణాల ప్రకారం పుష్కర ప్రాశస్త్యము గురించి ఒకానొకప్పుడు నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి "పుష్కరం అంటే ఏమిటి? పుష్కరుడి తండ్రి ఎవరు? పుష్కరుడు తీర్థరాజెట్లయ్యెను?” చెప్పమని కోరెను.
అప్పుడు బ్రహ్మ.. నారదా సార్థ త్రికోటి తీర్థాలు ఎక్కడ ఉండునో ఆ తీర్థమునకు పుష్కరమని పేరు. పూర్వము తుందిలకుడనెడి పరమ ధార్మికుడైన మునియుండెను. అతడు రేయింబవళ్ళు శివుడిని అర్చించి, ఆయన అనుగ్రహము వలన పుష్కరుడయ్యెను. శివానుగ్రహమును శివుని అష్టమూర్తులలో ఒకటైన జలరూపమును పొందియుండెను. తరువాత నేను తపస్సు చేసి శంకరునారాధించి, సామములతో శివుని స్తుతించి లోక సృష్టికి తోడ్పడుమంటిని. అతడు తీర్థరూపియైన పుష్కరుని నాకిచ్చెను. నేనాతనిని కమండలములో నుంచి సృష్టి చేయుచుంటిని.
ఇట్లుండగా ఒకప్పుడు అంగీరసుని కొడుకు బృహస్పతి తపస్సు చేసి నన్ను మెప్పించగా నీకేమి కావలెనో కోరుకొమ్మంటిని. అతడు 'నీవు నాకు ప్రసన్నుడవైనచో నాకు గ్రహాధిపత్యము, దేవతలలో గౌరవము, సర్వజ్ఞత్వమును ఇచ్చి, నీ కమండలములో నున్న తీర్థరాజగు పుష్కరుడు నా వశమగునట్లు చేయుమని' కోరెను.
అట్లే అని పుష్కరుని పిలిచి 'నిన్ను బృహస్పతి కిచ్చితిని, ఇంకప్పటి నుండి అతని ననుసరించుమనెను. పుష్కరుడు 'నేను మిమ్ము విడువజాలను, అనగా బ్రహ్మ.. 'నేను నిన్ను బృహస్పతికిచ్చినాను. నీవు వెళ్ళక తప్పదనెను. అప్పుడు పుష్కరుడు 'నేను మీతోనే ఉందును. మీరెచ్చటికి వెళ్ళిన నేనక్కడికి వత్తుననెను. బ్రహ్మ 'ఓ పుష్కరా! బృహస్పతి మేషాది రాశులలో చేరిననాటి నుండి పండ్రెండు రోజులు రేయింబవళ్ళును సంవత్సరమంతా మధ్యాహ్నవేళ రెండు ముహూర్తములున్నూ నీవా నదిలో ఉండవలెను. నేను నీతో కూడా ఉ౦డెదను అనెను.
బృహస్పతి పుష్కరుని పిలుచుకొని మేషాది రాశులలో ప్రవేశించినపుడు గంగాది నదులలో పుష్కరుడు సార్థత్రికోటి తీర్ధములతో సహా ఉండుచుండెను. ఆ సమయము పుణ్యకాలము కనుక అప్పుడు చేసిన దానములనంత కోటి ఫలములనిచ్చును. సమస్త నదులు, సమస్త తీర్థములున్ను అక్కడికి వచ్చి చేరును. అప్పుడు బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు, ఇంద్రాది దేవతలు, పితరులు, ఋషులు అందరును స్నానము చేసి ఇక్కడనే ఉందురు. కాన అప్పుడు చేసిన స్నానము, దానము అక్షయ ఫలమునిచ్చును.
గంగానది పుష్కర విశేషాలు :
భారతదేశంలో అనేక పుణ్య నదులున్నాయి. ఈ పుణ్యనదులలో పుష్కరాలు జరిగేటటువంటి 12 నదులకు ప్రత్యేక స్థానమున్నది. అలాగే సనాతన ధర్మంలో గంగానదికి కూడా ప్రత్యేకమైన స్థానమున్నది. గంగానదిలో ఏ మానవుడైనా సంకల్ప సహితముగా సమయముతో పని లేకుండా స్నానమాచరిస్తే వారికి గంగానది యొక్క అనుగ్రహముచేత పుణ్యము లభిస్తుంది. అటువంటిది గంగానదిలో పుష్కర సమయంలో చేసేటటువంటి స్నానానికి కొన్ని వేల రెట్ల పుణ్యఫలం ఉంటుంది.
గంగానది పుష్కర సమయంలో ఏ మానవుడైనా గంగానదిలో సంకల్ప సహిత పుష్కరస్నానమాచరించడం, పుష్కరాలలో చేసేటటువంటి దానం, జపము, తపము, హెూమాలు మరియు తర్పణాలు వంటి వాటివి విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది. గతించినటువంటి పితృ దేవతలకు గంగానది పుష్కరాలలో విడిచేటటువంటి తిలతర్పణాలకు విశేషమైనటు వంటి ఫలితము ఉంటుంది.
గంగానది పుష్కరాల్లో స్నానానికి యోగ్యమైన ప్రదేశాలు:
గంగానది ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో పూర్తి గంగగా ఏర్పడేటటువంటి దేవ ప్రయాగ క్షేత్రం, ఋషీకేశ్, హరిద్వార్, ప్రయాగ, కాశీ.. గంగానది పుష్కరాలలో గంగానది ఒడ్డున ఎక్కడైనా పుష్కరస్నానము ఆచరించవచ్చు. అయితే కాశీ, ప్రయాగ, రుషీకేశ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించడం విశేషం. గంగానది పుష్కరస్నానము 22 ఏప్రిల్ 2023 నుండి 2 మే 2023 వరకు ఉంటుంది. ఈ 12 రోజులలో స్నానమాచరించడం ఉత్తమం.
గంగానది పుష్కర స్నాన విధి:
పుష్కర స్నానము పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం చేసేటటువంటి స్నానము. పుణ్యాన్ని సంపాదించాలి అనేటటువంటి సంకల్పంతో స్నానాలు చేసేటటువంటివారు పుష్కరాలు జరిగేటటువంటి క్షేత్రాలలో భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానాన్ని ఆచరించాలి.
ఈ స్నానాన్ని పుష్కర స్నాన విధి ప్రకారం ఆచరించాలి. పుష్కర స్నానం ఆచరించేటటువంటివారు ఇంటియందే స్నానమాచరించి మగవారు అయితే పంచె కట్టుకొని పైన వస్త్రాన్ని వేసుకొని, స్త్రీలు చీర వంటి సౌకర్యమైనటువంటి వస్త్రమును ధరించి పుష్కరాలు జరిగేటటువంటి పుణ్యనది వద్దకు వెళ్ళాలి.
నదీ స్నానాన్ని ప్రారంభించే ముందు ఆ నదీమాతకు నమస్కరించి సంకల్ప సహితముగా పుష్కరస్నానాన్ని ఆచరించాలి. పుష్కర స్నానం ఆచరించేటప్పుడు సబ్బులు, షాంపులు వంటి వాటితో స్నానము చేయకూడదు. నదులలో ఆటలు వంటివి ఆడటం పాపము. పుష్కరాలు జరిగేటటువంటి నదులలో మలమూత్ర విసర్జన వంటివి చేస్తే పాతుకములోకి వస్తాయి.
పుష్కర స్నానాన్ని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో ఆచరించడం ఉ త్తమం. పుష్కర స్నానం అయిన తరువాత దేవతలకు ఋషులకు నదికి అర్ఘ్యము, తర్పణాలు వంటివి వదలాలి. ఈవిధముగా భక్తిశ్రద్ధలతో సంకల్ప సహితముగా పుష్కర స్నానాలు ఆచరిస్తే గంగానది పుష్కర స్నాన ఫలితము లభిస్తుంది.
- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ