Study room vastu tips: పిల్లల స్టడీ రూమ్ ఇలా ఉంటే పరీక్షల్లో టాప్ ర్యాంక్ పొందుతారు
28 January 2024, 11:00 IST
- Study room vastu tips: పిల్లలు సరిగా చదవకపోవడం వల్ల మంచి మార్కులు సాధించలేరు. వారి స్టడీ రూమ్ ఇలా ఉందంటే మాత్రం అన్నింటా విజయం సాధిస్తారు. మంచి మార్కులు పొందుతారు.
పిల్లలు బాగా చదవాలంటే ఇలా చేయండి
Study room vastu tips: పిల్లలని ఎంతసేపు ఆడుకోమన్నా ఆడుకుంటారు. కానీ పుస్తకం పట్టి చదవమంటే మాత్రం ఎక్కడ లేని నొప్పులు, నీరసం వచ్చేస్తాయి. చదువు మీద అసలు శ్రద్ధ పెట్టరు. ఇది చాలా మంది తల్లిదండ్రులకి ఉండే తలనొప్పి. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడానికి ఇంట్లో వాస్తు లోపాలు కూడా ఒక కారణం కావచ్చు.
వాస్తు శాస్త్రంలో పిల్లలకి సంబంధించిన అనేక పరిహారాలు ఉన్నాయి. ఇంట్లోని వాస్తు లోపం ప్రభావం పిల్లల చదువు మీద కూడా పడుతుంది. పిల్లలు తమ మాట వినడం లేదని, చదువు మీద దృష్టి పెట్టడం లేదని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీ పిల్లల రీడింగ్ రూమ్ ఏ దిశలో ఉందో చెక్ చేయాలి. పిల్లల భవిష్యత్తుని మెరుగుపరచడం కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే మీ పిల్లలు చదువులో టాప్ గా నిలుస్తారు.
గది ఏ దిశలో ఉండాలంటే
వాస్తు ప్రకారం పిల్లలు ఉండే గది నైరుతి దిశలో ఉంటే వాళ్ళు మీ మాట అస్సలు వినరు. అందుకే వారికి ఇంటి ఈశాన్య దిశలో ఉన్న గదిని కేటాయించాలి. అలాగే గదికి తూర్పు దిశలో ఉదయిస్తున్న సూర్యుడు చిత్ర పటాన్ని ఉంచాలి. స్టడీ రూమ్ లో ఈశాన్య మూల బరువు ఎక్కువగా పెట్టకూడదు. వీలైతే ఈశాన్య మూలని ఖాళీగా ఉంచడం మంచిది.
గది శుభ్రంగా ఉండాలి
గదిలోకి సూర్యరశ్మి వచ్చేలా చూసుకోవాలి. గదిలో తూర్పు లేదా ఈశాన్య దిశలో సరస్వతీ దేవి చిత్రాన్ని ఉంచాలి. అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు ఒక గ్లాసు నీటిని టేబుల్ మీద ఉంచండి. స్టడీ రూమ్ లో ఎలాంటి బరువైన వస్తువులు ఉంచకూడదు. గది ఎంత ఖాళీగా, శుభ్రంగా ఉంటే అంతగా చదవాలని అనిపిస్తుంది.
గది రంగు ముఖ్యమే
పిల్లల స్టడీ రూమ్ మాత్రమే కాదు వాస్తు ప్రకారం వారి గది రంగు కూడా ముఖ్యమే. పిల్లల స్టడీ రూమ్ ఎప్పుడు లేత రంగుల పెయింటింగ్స్ వేయాలి. లేత పసుపు, లేత గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు వేసుకుంటే మంచిది. అవి వేయడం వల్ల చదువు, లక్ష్యాల మీద దృష్టి పెట్టేందుకు తోడ్పడతాయి.
గ్లోబ్ తప్పనిసరి
వాస్తు ప్రకారం పిల్లలు చదువుకునే గదిలో తప్పనిసరిగా గ్లోబ్ పెట్టుకోవాలి. గ్లోబ్ ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈశాన్య దిశలో గ్లోబ్ ఉంచడం వల్ల పిల్లలకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
ఇంట్లో సానుకూల శక్తి ఉండాలంటే ఇలా చేయండి
ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకునేందుకు నైరుతి దిశలో రెండు స్పటిక వృత్తాలు పెట్టుకోండి. వాటిని ఉపయోగించే ముందు ఉప్పు నీటిలో ఒక వారం పాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని కడిగి గాజు ప్లేట్ లో పెట్టుకోవాలి. వాటిని మూడు గంటల పాటు ఎండలో ఉంచి ఆరిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే సానుకూల శక్తి పెరుగుతుంది.
అలాగే నైరుతి దిశలో కుటుంబ సభ్యులు నవ్వుతూ ఉండే ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడం మంచిది. అలాగే ఇంట్లో మహాభారతం, యుద్ధభూమి వంట హింసాత్మక చిత్రాలు పెట్టకూడదు. కత్తులు, కత్తెర, సూదులు మొదలైన వాటిని ఓపెన్ ప్లేస్ లోఉంచకూడదు. అలాగే వాటిని వంట గదిలో వేలాడదీయకూడదు.