Powerful mantralu: పిల్లలు చదువు మీద దృష్టి పెట్టేలా చేయగలిగే శక్తివంతమైన మంత్రాలు ఇవే
11 October 2024, 14:37 IST
- Powerful mantralu: చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ పిల్లలకు చిన్నతనం నుంచే ఈ మంత్రాలు నేర్పించండి. వారికి మంచి భవిష్యత్ ఇచ్చినట్టు అవుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వారికి సహాయపడే ఆరు శక్తివంతమైన మంత్రాలు ఇవే.
ఏకాగ్రతను పెంచే శక్తివంతమైన మంత్రాలు ఇవి
కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తు ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు. దాని వల్ల చదువులో వెనకబడి పోతారు. తల్లిదండ్రులు వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి ధైర్యం చెప్పాలి. చదువు మీద ఏకాగ్రత కలిగే విధంగా చూడాలి. జ్ఞాపకశక్తి పెంచేందుకు ప్రయత్నించాలి.
అందుకు వారికి చిన్నతనం నుంచే కొన్ని శ్లోకాలు, మంత్రాలు నేర్పించాలి. ఇవి వారికి మంచి భవిష్యత్ ను అందిస్తాయి. పూర్వం అయితే పిల్లలు నిద్రలేచిన దగ్గర నుంచి మంత్రాలు పఠించేవాళ్ళు. నిద్రలేవగానే కరాగ్ర వస్తే లక్ష్మీ అంటూ సకల దేవతలకు స్మరించుకుంటారు. ఈ మంత్రం పఠించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఇంతకుముందు గురుకులాల్లో పిల్లలకు ఈ మంత్రాలు బోధించే వాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకు తాత, తల్లిదండ్రులు పూజల సమయంలో మాత్రమే చెప్తున్నారు. అలా కాకుండా ఈ మంత్రాలు వారికి కంఠత వచ్చే విధంగా నేర్పించి నిత్యం పఠించేలా చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో సహాయపడుతుంది. ఈ ఆరు మంత్రాలు మీ పిల్లలకు తప్పనిసరిగా బోధించండి.
పవమాన మంత్రం
“అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్ మా అమృతంగమయ” అనే పవమాన మంత్రం చాలా సులభంగా అర్థవంతంగా ఉంటుంది. విద్యార్థులకు, పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిమ్మల్ని అబద్ధం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగులోకి, మరణభయం నుంచి జీవితాన్ని స్వీకరించడం కోసం దేవతలకు విన్నపం చేస్తూ ఈ మంత్రం పతిస్తారు. విద్యార్థులు ఈ మంత్రం పఠించడం వల్ల అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించడంలో సహాయపడుతుంది. తప్పు మార్గంలోకి వెళ్ళకుండా మనసును అదుపు చేస్తుంది.
గాయత్రీ మంత్రం
మంత్రం - ఓం భూర్ భువః స్వాహా, తత్ సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్
బాల్యం నుంచి పిల్లలకు బోధించే సులువైన మంత్రం ఇది. పురాతన మంత్రాలలో ఒకటి. అత్యంత శక్తివంతమైనది కూడా. ఈ మంత్రం విద్యార్థులు నిత్యం పఠించడం వల్ల చదువు మీదకు వారి దృష్టి మరలుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. అది మాత్రమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి భయాలు లేకుండా చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు.
ఓం నమః శివాయ
శివునికి అంకితం చేసిన మంత్రాలలో ఓం నమః శివాయ సులభమైనది. జ్ఞానాన్ని ప్రసాదిస్తూ సరైన మార్గమలో నడిపించమని వేడుకుంటూ ఈ మంత్రం పఠించవచ్చు. ఇది మనసు, శరీరంపై చాలా ప్రశాంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పరీక్షలంటే భయం, ఒత్తిడితో బాధపడే వాళ్ళు ఈ మంత్రం పఠిస్తే చాలా బాగుంటుంది. శివుని శక్తి, సానుకూలత మీకు రక్షణగా ఉంటుంది. భయం వీడి మార్గానిర్దేశం చేస్తుంది. జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు, ఏకాగ్రత లోపించినప్పుడు, చదువు మీద దృష్టి పెట్టలేనప్పుడు ఈ మంత్రం జపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.
ఓం
విశ్వంలోని ఆదిమ ధ్వని ఓం. ఎంతో శక్తివంతమైనది. ప్రతి రోజు కేవలం 30 సెకన్ల పాటు ఓం జపించడం వల్ల మనసు తేలిక పడుతుంది. సానుకూల శక్తితో నిండిపోతారు. మీకు రక్షణగా అనిపిస్తుంది. ఓం క్రమం తప్పకుండా జపించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
మహా మృత్యుంజయ మంత్రం
మంత్రం - ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. ఇది మహా శక్తివంతమైన మంత్రం. శివునికి సంబంధించిన మరొక మంత్రం ఇది. శివుని గుణాలను స్తుతిస్తూ జీవితంలోని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయం చేయమని కోరుకుంటూ దీన్ని పఠిస్తారు. విద్యార్థులు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరిగేందుకు అవసరమైన సహాయం చేస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.