Bhishma Ashtami 2023 । భీష్మాష్టమి ఎప్పుడు? ఈ రోజుకు ఉన్న విశిష్టత, పూజా విధానాలు తెలుసుకోండి!
26 January 2023, 9:09 IST
- Bhishma Ashtami 2023: మాఘ మాస శుక్ల పక్ష అష్టమి రోజున భీష్మాచార్యులు పరమాత్మలో ఏకం అవ్వాలని నిర్ణయించుకున్న రోజు. ఈరోజును 'భీష్మాష్టమి' గా పిలుస్తారు. అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ భీష్మాష్టమి రోజుకున్న విశిష్టతను తెలియజేశారు, చూడండి.
Bhishma Ashtami 2023
Bhishma Ashtami 2023: మాఘమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఇందులో అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టి మాఘ మాసమునకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది.
హిందూ పురాణాల ప్రకారం, మాఘ మాసంలో శుక్ల పక్షం అష్టమి తిథి నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందారని వేదపండితులు చెబుతుంటారు. అందుకే ఈరోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ 'భీష్మాష్టమి' జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
2023లో భీష్మాష్టమి ఎప్పుడు?
పంచాంగ కర్తల ప్రకారం, ఈ ఏడాది భీష్మాష్టమి జనవరి 28, శనివారం రోజున వస్తుంది.
అష్టమి తిథి ప్రారంభం అయ్యే సమయం: జనవరి 28, 2023న ఉదయం 08:43 గం.లకు
అష్టమి తిథి ముగుంపు సమయం: జనవరి 29, 2023న ఉదయం 09:05 గం.లకు
భీష్మాష్టమి విశిష్టత
మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేక స్థానమున్నది. భీష్మాచార్యులవారు ఈ సృష్టికి విష్ణు సహస్ర నామాన్ని అందించినటువంటి ఆచార్యులు. భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టగలడు. ఈమేరకు ఉత్తరాయణం కోసం వేచిచూచి తన ప్రాణమును త్యాగం చేసినటువంటి యోధుడు భీష్మాచార్యులు వారు. మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత, సూర్యుడు తన గతిని మార్చుకునేటువంటి రథసప్తమి వరకు ఆగి, ఆ రథసస్తమి పూర్తి అయిన తరువాత మాఘ మాస శుక్ల పక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి రోజు భీష్మాష్టమి.
భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి తల్లిదండ్రులకు, విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదలాలి. భీష్మాష్టమి రోజు గంగాస్నానం లేదా పుణ్యనదీ స్నానం ఆచరించడం, అలాగే నువ్వులను, అన్నమును దానము చేయడం చాలా విశేషం.
భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘ మాస పుణ్య నదీ స్నానాలు ఆచరించి, మహా విష్ణువును పూజించినవారికి, ఈ మూడు రోజులు విష్ణు సహస్రసామా పారాయణ చేసిన వారికి భీష్మాచార్యులు ఆశీస్సులు, మహావిష్ణువు అనుగ్రహం కలిగి వారికి పాపములు తొలగి, విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
టాపిక్