తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayodhya Ram Mandir: ఇనుము, సిమెంట్ లేకుండా అయోధ్య రామ మందిర నిర్మాణం

Ayodhya ram mandir: ఇనుము, సిమెంట్ లేకుండా అయోధ్య రామ మందిర నిర్మాణం

Gunti Soundarya HT Telugu

11 January 2024, 11:14 IST

google News
    • Ayodhya ram mandir: అయోధ్య రామ మందిర నిర్మాణంలోని ప్రతిదీ ఎంతో ప్రత్యేకత సంతరించుకుని ఉంది. ఇనుము, సిమెంట్ లేకుండా ఈ ఆలయం నిర్మించారు. 
అయోధ్య రామ మందిరం
అయోధ్య రామ మందిరం (PTI)

అయోధ్య రామ మందిరం

Ayodhya ram mandir: ఇప్పుడు ఎక్కడ చూసినా రామ నామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. అందరి చూపు ఒకవైపే. జనవరి 22వ తేదీ జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది కల రామ మందిర నిర్మాణం. ఈ ఆలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

ఇనుము లేకుండా

సాధారణంగా ఏదైనా కట్టడం నిర్మించేందుకు ఇనుము, సిమెంట్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కానీ అయోధ్యలో నిర్మితమైన రామ మందిరం మాత్రం ఎటువంటి సిమెంట్, ఇనుము, ఉక్కు లేకుండా నిర్మిస్తున్నారు. నాగర నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మించారు. కేవలం రాతితో అద్భుతమైన శిల్పాలు చెక్కి ఆలయాన్ని నిర్మించారు. భూకంపాలు కూడా తట్టుకునే విధంగా ఈ ఆలయం కట్టారు.

సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామంచల ప్రదీప్ కుమార్ ఆలయ నిర్మాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇనుము కాలక్రమేణా తుప్పు పడుతుంది. దీని వల్ల ఉపయోగం ఉండదు. దేవాలయం మన్నిక మరింత పెంచి, భూకంపాలు తట్టుకునేలా విధంగా నిర్మించాము. పురాతన నాగర నిర్మాణ శైలిలో అనుసరించి నిర్మించిన ఆలయం ఇది. ఎన్నో ఏళ్లు చరిత్రలో చీరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా నిర్మించారు. దీని మొత్తం కట్టడం కోసం రాయి ఉపయోగించినట్టు ఆయన తెలిపారు.

పింక్ రాయి

రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేకమైన రాయి ఉపయోగించారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ నుంచి గులాబీ రాయిని తెప్పించారు. ప్రత్యేక మెషీన్స్ తో వాటిని కట్ చేయించి అద్భుతంగా కళాకృతులు చెక్కించారు. ఇతర కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కంటే ఇది చాలా తేలికగా ఉంటుంది. ప్రతి ఒక్క రాయి జాగ్రత్తగా గాడి చేసి సిమెంటు అవసరం లేకుండా నిర్మాణం చేపట్టారు. ఈ రాయి భూకంపాలు కూడా తట్టుకుని నిలబడుతుంది. సుమారు వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి ఎటువంటి రిపేర్లు రావు. రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ గులాబీ రాయి చాలా దృఢంగా ఉంటుంది.

నిర్మాణ సమయంలో అనేక సవాళ్ళు

రామ మందిర నిర్మాణ పునాది సమయంలో అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. భూసార పరీక్ష నిర్వహించినప్పుడు ఇక్కడ భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. అడుగు భాగం ఇసుకతో ఉండటం వల్ల కష్టంగా మారింది. దీంతో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే, ఐఐటీ ఢిల్లీ, గువాహతీ, చెన్నై, రూర్కె, ముంబై, ఎల్ అండ్ టీకి చెందిన నిపుణులు అందరూ కలిసి దీనికి ఒక పరిష్కారం ఆలోచించారు. పునాది వేయడానికి ముందు భూమి లోపల సుమారు 14 మీటర్ల మేర ఇసుకని తొలగించారు.

పునాది కోసం రాళ్ళని సిద్ధం చేసేందుకు రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ తో 56 పొరలతో కాంక్రీట్ మిక్స్ తయారు చేసి వేశారు. ఇది రోజులు గడిచే కొద్ది రాయిగా మారుతుంది. ఈ రాళ్ళ మీద ఆలయ పునాది నిర్మించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు.

అయోధ్య రామ మందిరం నాగర నిర్మాణ శైలిలో నిర్మించారు. ఇది ఉత్తర భారతదేశంలోని హిందూ మతాలు నిర్మించే మూడు శైలులో ఒకటి. వింధ్య, హిమాలయ మధ్య ప్రాంతంలో ఈ నిర్మాణ శైలి ముడిపడి ఉంది. ఈ నిర్మాణ శైలిలో ఇనుము ఉపయోగించరు. ఖజురహో ఆలయం, సోమనాథ్ ఆలయం, కోణార్క్ లోని సూర్య దేవాలయం నాగర నిర్మాణ శైలిలో ఉన్న ఆలయాలు.

తదుపరి వ్యాసం