PMSBY | ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: రూ. 12లకే రూ. 2 లక్షల ప్రమాద బీమా
09 May 2022, 17:26 IST
- ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి ఏడాది కేవలం రూ. 12 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ పాలసీ కలిగిన వ్యక్తి మరణిస్తే లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం ప్రవేశపెట్టి ఏడేళ్లయ్యింది.
ప్రతీకాత్మక చిత్రం: ప్రమాద దృశ్యం
PMSBY.. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి ఈ పథకం పరిధిలో ఒకే పాలసీ లభిస్తుంది.
ఈ పాలసీ పొందేందుకు కేవలం ఒక్క ఆధార్ కార్డు సరిపోతుంది. ఆధార్ కార్డు లేనిపక్షంలో బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా తగిన గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
పాలసీ ముఖ్య విషయాలు
– బీమా రక్షణ ఏడాది కాలానికి వర్తిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకూ చెల్లుబాటవుతుంది. ఏటా మే 31 తేదీన పునరుద్ధరించుకోవచ్చు.
– ప్రతి ఏడాది మనం వెళ్లి చెల్లించాల్సిన అవసరం లేకుండా సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ద్వారా మన చందాను బ్యాంకు వసూలు చేసుకునే వీలు కూడా ఉంది.
– ఈ పథకంలో మధ్యలో వైదొలగినప్పటికీ తిరిగి మళ్ళీ ఈ పథకంలో చేరవచ్చు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాలుః
– పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే నామినీ రూ. 2 లక్షల బీమా పొందుతారు.
– ప్రమాదంలో రెండు కళ్ళు గానీ, రెండు చేతులు గానీ, రెండు పాదాలు గానీ పూర్తిగా కోల్పోయినా బీమా పూర్తి ప్రయోజనం వర్తిస్తుంది.
– ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయినా, చేయి లేదా పాదం పనిచేయకపోయినా రూ. 2 లక్షల బీమా సౌకర్యం పాలసీదారుడు పొందుతారు.
–ఒక కన్ను లేక ఒక చేయి లేదా పాదం పాక్షికంగా పనిచేయకపోయినపుడు ఒక లక్ష రూపాయల మేర బీమా సౌకర్యం పొందుతారు. పాలసీ తీసుకునేటపుడే నామినీ వివరాలు పొందుపరచాలి.