PMJJBY | రూ. 330కే రూ. 2 లక్షల బీమా అందిస్తున్న పీఎంజేజేబీవై
01 March 2022, 13:44 IST
- PMJJBY.. ఏ కారణం చేత మరణించినా రూ. 2 లక్షల బీమా అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) పథకం అమలు చేస్తోంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న బ్యాంకు పొదుపు ఖాతాదారులందరూ పీఎంజేజేబీవై పథకానికి అర్హులే. ఎన్ని ఖాతాలు ఉన్నప్పటికీ ఈ పథకం ద్వారా ఒకే పాలసీ లభిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం : కుటుంబం
ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ప్రమాదవశాత్తు గానీ, ఇతర కారణాల వల్ల గానీ మరణిస్తే రూ. 2 లక్షల మేర బీమా అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో చేరవచ్చు.
PMJJBYలో మన చందా ఎంత?
ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజనలో చేరాలంటే ఏటా రూ. 330 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులే ఆటో డెబిట్ విధానంలో మన బ్యాంకు ఖాతా నుంచి తీసుకునేందుకు మనం అంగీకరించాల్సి ఉంటుంది.
PMJJBYలో చేరితే ప్రయోజనాలు ఇవీ..
పాలసీదారుడు మరణిస్తే నామినేట్ చేసిన వ్యక్తికి బీమా ద్వారా రూ. 2 లక్షలు లభిస్తాయి. ప్రీమియం సకాలంలో సక్రమంగా చెల్లించి ఉంటే బీమా సొమ్ము నామినీలకు అందుతుంది.
ప్రతి ఖాతాదారు పీఎంజేజేబీవై కింద సహాయం పొందాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నామినీ పేర్లను పొందుపరచాల్సి ఉంటుంది.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే వారు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది అవుతుంది. అందువల్ల ఈ పథకం గురించి తెలిసిన వారందరూ మిగిలిన వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.