నవ భారత నిర్మాత.. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో జరిగిన చారిత్రాత్మక ఘట్టాలు ఇవే!
24 January 2022, 21:50 IST
- అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడు. విశాల భారతానికి 1998 నుంచి 2004 వరకు ప్రధానిగా సేవలందించారు. ప్రతిపక్షాలు సైతం ఆయనను ప్రేమించాయి. అజాత శతృవుగా, ప్రతిభావంతుడిగా గొప్ప నాయకుడిగా కీర్తి గడించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి
అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశ రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన నేత. నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన మార్గదర్శి. భారత ప్రధానిగా 1998 నుంచి 2004 దేశాన్ని ముందుకు నడిపిన మహా నాయకుడు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే పార్టీలకతీతంగా ఎందరో నాయకులు ఆయనను అభిమానించే వారు. రాజకీయాల్లో అజాత శతృవుగా, ప్రతిభావంతుడిగా, గొప్ప నాయకుడిగా వాజ్‌పేయి కీర్తి గడించారు. వాక్చాతుర్యంలోనూ ఆయనకు ఆయనే సాటి. వాజ్‌పేయి మాట్లాటే ప్రతి మాట కవితాత్మకంగానూ, ఆలోచింపచేసే విధంగానూ ఉంటుంది.
వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్యత పదివిని చేపట్టారు. తన వాక్చాతుర్యంతో, సాహసోపేత నిర్ణయాలతో ప్రజల మనస్సును గెలుచుకున్నారు. 1950లో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన, 1996 మే నెలలో తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ప్రధానిగా వాజ్‌పేయి తీసుకున్న పలు చారిత్రాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో చెరగని ముద్రవేశాయి.
వాజ్‌పేయి హయాంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు:
ఫోఖ్రాన్ 2 ప్రయోగం
1998లో వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అణ్వస్త్ర పరీక్షలపై దృష్టి సారించారు. దీనికి ‘ఆపరేషన్ శక్తి’ అని నామకరణం చేశారు. గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచం వెన్నులో వణుకు పుట్టించారు. దీంతో భారత్ అణుపరీక్షల నిర్వాహణపై అమెరికా ఆంక్షలు విధించింది. అందుకు దీటుగా భారత్ కూడా స్పందించింది. అణ్వస్త్ర శక్తిగా భారత్ ఎదిగినప్పటికీ ఏ దేశంపైనా ముందుగా దాడిచేయదని వాజ్‌పేయి వెల్లడించారు. అప్పుడు ఈ అపరేషన్‌కు అబ్దుల్ కలాం డీఆర్‌డీవో చీఫ్‌గా వ్యవహారించగా, రక్షణశాఖ మంత్రి జస్వంత్ సింగ్ సలహాదారుగా ఉన్నారు.
భారత్-పాక్ మధ్య తొలిసారి బస్సు సర్వీసులు
సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాయాది పాక్‌కు స్నేహ హస్తాన్ని సైతం అందించారు. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య తొలిసారి బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఈ తొలి బస్సులోనే ప్రధాని హోదాలో వాజ్‌పేయి పాక్‌లోని లాహోర్ వెళ్లి అక్కడ ఉన్న మినార్-ఇ-పాకిస్థాన్‌ను సందర్శించారు. అనంతరం పాకిస్థాన్ సార్వభౌమాధికారంతో సుసంపన్నమైన దేశంగా ఎదగాలని అక్కడి విజిటర్స్ బుక్‌లో రాశారు.
1999- కార్గిల్ యుద్ధం
ఆపరేషన్ విజయ్.. వాజ్‌పేయిని దేశ రాజకీయ చరిత్రలో బలమైన నేతగా నిలబెట్టింది. కార్గిల్ దురాక్రమణకు ప్రయత్నించిన పాక్ దళాలను భారత సైన్యం తిప్పికొట్టింది. అప్పట్లో దాయాదుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచింది. నైతికంగా కూడా విజయం తమదే అని చాటేందుకు వాజ్‌పేయి తన నేర్పరితనంతో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌కు మద్దతిచ్చేలా చేశారు. ఐరాస నుండి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సమన్లు పంపేలా చేశారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేలా వాజ్‌పేయి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. భారత్ సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ విజయ్' పోరాటంతో 1999, మే 3న పాక్ దళాలు వెనక్కి పారిపోయాయి.
ఎయిర్ ఇండియా విమానం హైజాక్
1999లో పాక్ ఉగ్రవాదులు భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేశారు. భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద ఉగ్ర సవాళ్ళలో ఇది ఒకటి. భారత జైళ్లలో ఉన్న మౌలానా మసూద్ అజర్, ముస్తాక్ అహ్మద్ జర్గార్, ఒమర్ సయీద్ లాంటి కీచక ఉగ్రవాదులను విడుదల చేయాలంటూ ఖాట్మండు నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. దీంతో ప్రయాణికుల క్షేమం దృష్ట్యా వాజ్‌పేయి ప్రభుత్వం వారిని విడుదల చేయాల్సి వచ్చింది.
2002 గుజరాత్ అల్లర్లు
భారత సమాఖ్య నిర్మాణానికి విఘాతంగా భావించిన నాటి గుజరాత్ అల్లర్లు వాజ్‌పేయి హయాంలోనే జరిగాయి. 2002 ఫిబ్రవరిలో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలకు అల్లరి మూకలు నిప్పు అంటించారు. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు మరణించారు. ఆ తర్వాత చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ వ్యవహిరించారు. అల్లర్ల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, వాజ్‌పేయి మాత్రం మోదీకి మద్దతుగా నిలిచారు.