భారతదేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళా నాయకులు వీరే!
24 January 2022, 21:50 IST
- పురుషాధిక్య సమాజంలోనూ కొందరు మహిళా నాయకులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఈ దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే నేతలుగా ఎదిగారు.
భారతీయ మహిళా రాజకీయ నాయకులు
మహిళలకు అన్నిరంగాలలో సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యం అన్నారు గాంధీజీ. మహత్ముడు కలలు కన్నట్లుగానే కాలక్రమేణా సమాజంలో చాలా వరకు మార్పు వచ్చింది. అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యం పెరిగింది. నేటి భారతీయ మహిళ.. విద్య, వైద్యం, మీడియా, కళలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుతుంది. దేశ పురోభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తుంది.
ఏదైమైనా..మహిళలు ఎన్ని రంగాల్లో రాణించినా.. దేశంలో స్త్రీ-పురుష వివక్ష ఇంకా కొనసాగుతుంది. అయినప్పటికీ ఇలాంటి పురుషాధిక్య సమాజంలోనూ కొందరు మహిళా నాయకులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఈ దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే నేతలుగా ఎదిగారు. ఇలా ఇప్పటి వరకు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళా రాజకీయ నాయకులుగా పేరుగాంచిన కొందరు మహిళా నేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శక్తివంతమైన మహిళా నాయకులు
ఇందిరా గాంధీ
ఇందిరా గాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాన మంత్రి. దాదాపు18 ఏళ్ల పాటు భారతదేశానికి ఏకఛత్రాధిపత్యం వహించిన తిరుగులేని నాయకురాలు. 'గరీబీ హటావో' (పేదరికాన్ని పారద్రోలండి) అనే ఆమె నినాదం యావత్ దేశాన్ని ఆకర్షించింది. బ్యాంకుల జాతీయకరణం ద్వారా వివిధ వర్గాల ప్రజల మన్ననలు అందుకున్నారు. సిక్కుల కోరిక మేరకు వారికి పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మనదేశ సైన్యంతో బంగ్లాదేశ్‌లో రాజ్యమేలుతున్న పరాయి సైన్యాన్ని ఓడించి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించారు, స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేశారు.
అయితే 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఆమె రాజకీయ జీవితంలో మాయని మచ్చగా నిలిచింది. 1975 జూన్ 25న ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ ఏకపక్షంగా తీసుకున్న 'దేశవ్యాప్త అత్యయిక పరిస్థితి' నిర్ణయం ప్రజాసామ్య వ్యవస్ధను ఖూనీ చేసినట్లయింది. ఆ సమయంలో దాదాపు 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలింది. 1984, అక్టోబర్ 31న ఇందిరాగాంధీ ఆంతరంగిక భద్రతా సిబ్బందిలోనే ఇద్దరు సిక్కు గార్డులు ఆమెపై కాల్పులు జరపడంతో ఇందిర ప్రాణాలు కోల్పోయింది.
సోనియా గాంధీ
సోనియా గాంధీ! ఈ పేరును ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా అందరికీ సుపరిచితమే. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడినపుడు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన ఒకానొక సందర్భంలో సోనియా రాజకీయాల్లోకి ప్రవేశించింది. అయితే గతంలో ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేనందున నేతలెవరు ఆమెను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తీసుకున్న చర్యలు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చాయి. సోనియా మార్గదర్శకత్వంలో 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో పార్టీపై సోనియాకు పట్టుపెరిగింది. సోనియా ఏం చెప్తే కాంగ్రెస్ పార్టీలో అదే శాసనం అన్నట్లుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ 127 ఏళ్ల చరిత్రలో అత్యధిక కాలం పాటు అధ్యక్షురాలిగా పనిచేసిన ఘనత సోనియా గాంధీదే. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యహరిస్తున్నారు.
జయలలిత జయరామన్
దివంగత నేత జయలలిత జయరామన్ ఆరు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి ఆమె మరణించిన 2016 వరకు దాదాపు 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. తమిళ ప్రజలు ఆమెను అమ్మగా పిలుచుకుంటారు. ఎంజీఆర్ మరణానంతరం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ పగ్గాలు అందుకున్న జయలలిత ప్రత్యర్థుల నుంచి ఎన్నో అనుమానాలు, ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కుట్రలను పటాపంచలు చేసి ధీటుగా ముందుకు సాగారు. 38 ఏళ్ల వయసులోనే రాష్ట్ర శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా తమిళ రాజకీయాలలో ఓ చరిత్రను లిఖించారు. AIADMK ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు రాజకీయాల్లో ఒక శక్తివంతమైన మహిళానేతగా జయలలిత తనదైన ముద్రవేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్ధిక స్వేచ్చను కల్పించారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన జయలలిత, అక్రమ ఆస్తుల కేసులో జైలు జీవితం కూడా అనుభవించారు. 2016 డిసెంబరు 5న ఆనారోగ్య కారణాలలో జయలలిత తుదిశ్వాస విడిచారు.
మాయావతి
మాయావతి భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దళిత మహిళా నాయకురాలు. ఒక పాఠశాల ఉపాధ్యాయురాలుగా జీవితం మొదలుపెట్టిన ఆమె ఏకంగా రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే మహిళా నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మమతా బెనర్జీ
మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రి. మూడు దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గద్దె దించి మమత చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ యువజన విభాగంలో పని చేసిన ఆమె తొలిసారిగా 1984 లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ కోల్‌కతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1997లో సొంతంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. నందిగ్రామ్,సింగూర్ ఆందోళనలతో రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. ఆ పోరాటాల ఫలితంగా 2011లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలిగా పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రెండు సార్లు రైల్వే మంత్రిగా పని చేశారు. భారతదేశపు మొదటి మహిళా రైల్వే మంత్రి కూడా మమతానే. అడపదడపా కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నిస్తూ దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తున్నారు.
వీరితో పాటు నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్, వసుంధర రాజే తదితరులు కూడా శక్తివంతమైన మహిళా నేతలుగా ఖ్యాతి గండించారు.