తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adani Group : అదానీకి దక్కిన 'అమృత కాలం'తో బీజేపీకి నష్టం తప్పదా?

Adani group : అదానీకి దక్కిన 'అమృత కాలం'తో బీజేపీకి నష్టం తప్పదా?

HT Telugu Desk HT Telugu

03 February 2023, 11:03 IST

google News
    • Adani group latest news : అదానీ గ్రూప్​ వ్యవహారంపై ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే.. మోదీ ప్రభుత్వం అండతోనే అదానీ గ్రూప్​లో మోసాలు జరిగాయని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కేంద్రం, అదానీ గ్రూప్​లు చూపిస్తున్న ‘జాతీయవాదాన్ని’ పలువురు విమర్శకులు లేవనెత్తుతున్నారు. మరి అదానీ వ్యవహారంపై మోదీ ప్రభుత్వంపై ఎఫెక్ట్​ చూపిస్తుందా?
అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ
అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ (Bloomberg)

అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ

Adani Group Modi : "జాతీయవాదం".. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో గత కొన్నేళ్లుగా ఈ పదం నిత్యం వినిపిస్తూనే ఉంటోంది. జాతీయవాదం ముసుగులో అరాచకాలు, మోసాలు జరుగుతున్నట్టు దేశంలోని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న బీబీసీ డాక్యుమెంటరీ​, ఇవాళ 'అదానీ' వ్యవహారం.. ఈ రెండింట్లోనూ ఉన్న సారూప్యత జాతీయవాదమే! ఓవైపు.. జాతీయవాదం, జాతీయ జెండాలతో విదేశీ విమర్శలకు మోదీ ప్రభుత్వం చెక్​ పెడుతుంటే.. ఇప్పుడది వ్యాపార సామ్రాజ్యానికి కూడా విస్తరించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జాతీయవాదం ముసుగులో..

భావప్రకటనా స్వేచ్ఛ ద్వారా జాతీయవాదాన్ని ప్రశ్నించడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి! ప్రజాస్వామ్య విలువల కన్నా ప్రభుత్వానికి జాతీయవాదమే సిద్ధాంతంగా మారినట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్య శక్తులను అడ్డుకునేందుకు.. కొందరు ఈ జాతీయవాదం ముసుగులో ప్రణాళికలు రచిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధానాలను ప్రశ్నిస్తే.. దేశంపై దాడి చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాము.

Adani group crisis : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇందుకు ఉదాహరణ. 2002 గుజరాత్​ అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ.. దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. దేశంపై కుట్ర జరుగుతోందంటూ.. ఈ డాక్యుమెంటరీని నిషేధించారు.

జాతీయవాదం ముసుగులో, జాతీయ జెండాను కప్పుకుని, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం రాజకీయ నేతలకు కొత్తమే కాదు. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి 'క్రోనీ క్యాపిటలిస్ట్​'లు (రాజకీయ నేతలతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు) కూడా చేరుతుండటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం!

Adani group Modi government : అదానీ గ్రూప్​ చుట్టూ నెలకొన్న అనిశ్చితిని గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ వేలెత్తి చూపించిన లోపాలపై స్పందించకుండా.. జాతీయ వాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రకటనలు చేసిన అదానీ గ్రూప్​ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్​లో భారీస్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్టు హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదిక ప్రచురించింది. దీనిని అదానీ గ్రూప్​ ఖండించింది. అదే సమయంలో.. ఆత్మరక్షణ కోసం జాతీయవాదాన్ని వినియోగించుకుంది! 'తమపై దాడి.. దేశంపై దాడితో సమానం' అంటూ అదానీ సిబ్బంది ప్రకటనలు చేయడం హాట్​టాపిక్​గా నిలిచింది.

వ్యాపార సామ్రాజ్యానికి బడా ప్రోత్సాహకాలు..!

Hindenburg report on Adani : ఇక్కడ అత్యంత ఆందోళనకర విషయం మరొకటి ఉంది. హిన్​డెన్​బర్గ్​ నివేదిక చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్​ సీఎఫ్​ఓ జుగేషిందర్​ సింగ్​ తీవ్రంగా ఖండిస్తూ.. వీడియోను విడుదల చేశారు. అందులో అదానీ గ్రూప్​ లోగో ఎక్కడా కనిపించలేదు. భారత జెండా మాత్రం బ్యాక్​డ్రాప్​లో స్పష్టంగా కనిపించడం గమనార్హం.

అదానీ గ్రూప్​లోని కంపెనీలు గత కొన్నేళ్లుగా భారీ వృద్ధిని సాధించాయి. పోర్టుల నుంచి నిత్యావసరాల వరకు.. అన్నింట్లోను అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకుంది. భారత ప్రభుత్వంతో బడా బ్యాంక్​లు ప్రోత్సహించడంతో అదానీ వెనుదిరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Adani vs Hindenburg : అదానీ గ్రూప్​ చెప్పిన 'జాతీయవాదం' మాటల్లో, విదేశీ విమర్శలపై భారత ప్రభుత్వం స్పందించే తీరులో వ్యత్యాసం కనిపించడం లేదు. అదానీపై ఆరోపణలు కొత్త విషమేమీ కాదు. అదానీ గ్రూప్​పై అవనీతి, మనీ లాండరింగ్​, మోసం, పన్ను ఎగవేత వంటి ఆరోపణలు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ స్థానికంగా అప్పుడప్పుడు వినిపించడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజా వివాదంతో ప్రపంచమంతా అదానీ గ్రూప్​వైపే చూస్తోంది. అదానీ వ్యాపారాల్లో నిజంగా మోసాలు జరిగాయా? అన్న విషయం తెలుసుకోవాలని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. ఈ అంశం విపక్షాలకు ఓ ఆయుధంగా మారింది.

అదానీతో బీజేపీ లింక్​..!

ప్రధాని మోదీకి గౌతమ్​ అదానీ అత్యంత సన్నిహితుడని ఆరోపణలు నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందుకే అదానీ వ్యాపారాలు దూసుకెళుతున్నట్టు చెబుతూ ఉంటారు. అదానీ గ్రూప్​తో బీజేపీ లింకులపై మీడియాలో వార్తలు జోరుగా సాగుతూనే ఉంటాయి.

Hindenburg Research on Adani Group : 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. మోదీ ప్రభుత్వంపై 'అదానీ' ఎఫెక్ట్​ పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదికతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు తగ్గుతాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక మోదీ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతున్న విపక్షాలు.. 'అదానీ' అంశాన్ని అడ్డం పెట్టుకుని తీవ్రస్థాయిలో రాజకీయాలు చేస్తున్నాయి. విపక్షాల్లో ఎన్నడూ లేని ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ.. పార్లమెంట్​ సమావేశాలను స్తంభింపజేస్తున్నాయి. అదానీ గ్రూప్​ లావాదేవీలు, ఆర్థిక వ్యవస్థపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేస్తున్నాయి.

అదానీకి దక్కిన 'అమృత కాలం'తో బీజేపీకి నష్టం తప్పదా?

తాజా వివాదం మధ్య అదానీ బృందంపై సెటైర్లు పేలుతున్నాయి. అదానీకి మోదీ ప్రభుత్వం ఇచ్చిన 'అమృత కాలం' ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదానీతో పాటు మోదీ ప్రభుత్వ పతనం కూడా తప్పదని పలువురు జోస్యం చెబుతున్నారు. ఇది నిజంగా సాధ్యమేనా? అని ఆలోచిస్తే.. రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Narendra Modi government Adani group news : ''భారత్​లో పెట్టుబడులు పెట్టండి.. మీకే లాభం' అంటూ మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా విపరీతమైన ప్రచారాలు చేసింది. అంతర్జాతీయ వేదిక కూడా.. భారత్​లో పెట్టుబడులే బెటర్​ అని భావిస్తున్న రోజులు ఇవి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం భయాలు నెలకొన్న వేళ.. భారత్​కు విదేశాల నుంచి నిధుల ప్రవాహం రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. ఈ సమయంలో అదానీ వ్యవహారం కేంద్రాన్ని షాక్​కు గురిచేసిందనే చెప్పుకోవచ్చు! కానీ అదానీపై పూర్తిస్థాయి దర్యాప్తునకు కేంద్రం ఒప్పుకుంటుందా? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. అదానీలో తప్పులు జరిగినట్టు రుజువైతే.. మోదీ ప్రభుత్వ కలలు కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. విదేశీ పెట్టుబడిదారులు.. ఇండియాలో ఇన్​వెస్ట్​మెంట్​ చేసేందుకు ఒకటి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ఇంత రిస్క్​ తీసుకోకపోవచ్చు. తమ ఆర్థిక స్థిరత్వం, మోదీ కలలను దెబ్బతీసే విధంగా అదానీపై బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు,' అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కానీ అదానీ వ్యవహారంపై ఇప్పుడున్నదాని కన్నా తీవ్రత ఎక్కువైతే.. ఇప్పటివరకు 'మోదీ' మాయలో ఇండియాలో పెట్టుబడులు పెట్టిన వారు పునరాలోచించుకునే ప్రమాదం ఉంటుంది. ఇదే జరిగితే ఎల్​ఐసీ, ఎస్​బీఐతో పాటు పన్నులు చెల్లించే ప్రజలపై అధిక భారం పడుతుంది.

విపక్షాలకు సువర్ణావకాశం.. కానీ!

మరోవైపు.. గత 8ఏళ్లల్లో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టి, ప్రజల్లో తమ మద్దతును పెంచుకునేందుకు విపక్షానికి ఎన్ని అవకాశాలు దక్కాయి. కానీ అవన్నీ ఉపయోగం లేకుండా పోయాయి. ముఖ్యంగా.. బీజేపీ ప్రభుత్వం కట్టిన 'జాతీయవాదం' గోడను కాంగ్రెస్​ పార్టీ బద్దలు కొట్టలేకపోతోంది. అలాంటిది.. ఇప్పుడు అదానీ వ్యవహారంతో వచ్చిన సువర్ణ అవకాశాన్ని కూడా కాంగ్రెస్​ విడిచిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gautam Adani latest news : ఏదీ ఏమైనా.. ఈ పూర్తి వ్యవహారంలో ఎవరి స్క్రిప్​లు వారు రాసుకుంటున్నట్టు కనిపిస్తోంది. బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో జరిగిందే మరోమారు కనిపించే అవకాశం లేకపోలేదు. 'భారత దేశ వృద్ధిని తట్టుకోలేక పాశ్చాత్య దేశాలు చేస్తున్న కుట్ర'గా అదానీ వ్యవహారాన్ని చిత్రీకరించే ప్రమాదం ఉంది.

ప్రస్తుతానికైతే.. మోదీకి ఉన్న ఇమేజ్​ ముందు ఏదీ నిలబడే విధంగా లేదు. జాతీయవాదం ముసుగులో బీజేపీ చేస్తున్న పనులు విజయవంతం అవుతుండటం.. మోదీకి మరింత ప్లస్​ పాయింట్​గా మారుతున్నాయి. అటు అదానీ గ్రూప్​ను కూడా బాధితులుగా చిత్రీకరించే పనిలో మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ ప్రచారాలే ఫలిస్తే.. బలమైన విద్రోహ శక్తులు చేతులు కలిపి తమని బలహీనం చేసేందుకు పన్నిన కుట్రగా తాజా పరిణామాలను అదానీ గ్రూప్​ అభివర్ణించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు!

తదుపరి వ్యాసం