Delhi next CM : దిల్లీ తదుపరి సీఎం ఎవరు? భార్యకు కేజ్రీవాల్ ఆ బాధ్యతలు ఇస్తారా?
16 September 2024, 11:20 IST
దిల్లీ తదుపరి సీఎం ఎవరు? అన్న ప్రశ్నపై ఉత్కంఠ నెలకొంది. రేసులో అతిషి ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఈ పదవిని చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం!
అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆదివారం ప్రకటించి, అందరిని షాక్‌కి గురు చేశారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఇక ఇప్పుడు దిల్లీ తదుపరి సీఎం ఎవరు? అన్న ప్రశ్నపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో పలువురు ఆప్ సీనియర్ నాయకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
రేసులో ఆ ఆరుగురు..!
అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ వంటి ప్రస్తుత దిల్లీ శాసనసభ్యుల్లో ఒకరు కేజ్రీవాల్ తర్వాత సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఈ పదవిని చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం.
దిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా దళిత నేతను నియమించే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎవరి పేరూ బయటకు రాలేదు.
తన మాజీ డిప్యూటీ మనీశ్ సిసోడియా బాధ్యతలు స్వీకరించే అవకాశాలను స్వయంగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఎన్నికలు జరిగే వరకు ఆప్ నుంచి ఒకరు తన స్థానాన్ని భర్తీ చేస్తారని ధృవీకరించారు.
ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ కాలపరిమితి 2025 ఫిబ్రవరి 11తో ముగియనుంది. చివరిగా దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న జరిగాయి. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆప్ కు 62, భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు దక్కాయి.
నిజాయితీ ఆధారంగా ఓట్లు అడిగేందుకు కేజ్రీవాల్‌తో కలిసి ప్రచారం చేస్తానని, ప్రజల నుంచి క్లీన్ చిట్ వచ్చే వరకు ఎలాంటి అధికారిక పదవి చేపట్టబోనని సిసోడియా సైతం ప్రకటించారు.
విద్య, ఆర్థికం, రెవెన్యూ, న్యాయ శాఖలతో పాటు పలు కీలక శాఖలను నిర్వహించడం ద్వారా అతిషి ముఖ్యమంత్రి పీఠం రేసులో ముందు వరుసలో ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిసోడియా, కేజ్రీవాల్‌లు జైలులో ఉన్నప్పుడు.. ఆప్ తరఫున ఆమె తీవ్రస్థాయిలో పోరాటం చేసి వార్తల్లో నిలిచారు. కేజ్రీవాల్ సైతం.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆమెనే నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన స్థానంలో గహ్లోత్‌ను నియమించారు.
కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేశారు?
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 6 నెలల పాటు జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఫలితంగా 3 రోజుల క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా తన రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని దిల్లీ సీఎం వెల్లడించారు.
"ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్రజలు తమ తీర్పును వెల్లడించే వరకు నేను ఆ సీటులో కూర్చోను. దిల్లీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. కోర్టులో నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజా కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది. ప్రజల తీర్పు వచ్చిన తర్వాతే నేను తిరిగి దిల్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాను," అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
2013 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల కోసం 2025 ఫిబ్రవరిలో తాత్కాలిక షెడ్యూల్‌ని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం ఇప్పటికే ఫోకస్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కసరత్తు 2025 జనవరి ప్రారంభంలో ముగుస్తుందని, 2025 జనవరి 6న ఓటర్ల జాబితా తుది ప్రచురణ జరుగుతుందని సమాచారం.