Who is Keir Starmer?: బ్రిటన్ కొత్త ప్రధాని కానున్న కెయిర్ స్టార్మర్ ఎవరు? భారత్ పై ఆయన వైఖరి ఏంటి?
05 July 2024, 16:37 IST
బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 14 ఏళ్ల తరువాత, కన్సర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించి లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీని గెలుపు బాట పట్టించిన కెయిర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు. ఆయన బ్రిటన్ లోని భారతీయుల మద్దతు పొందేందుకు పలు హామీలు ఇచ్చారు.
బ్రిటన్ కాబోయే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్
బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ దేశ కొత్త ప్రధాని కానున్నారు. కెయిర్ స్టార్మర్ నాయకత్వంలో లేబర్ పార్టీ భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీపై ఘన విజయం సాధించింది.
కెయిర్ స్టార్మర్ ఎవరు?
బ్రిటన్ తదుపరి ప్రధాని కాబోతున్న 61 ఏళ్ల కెయిర్ స్టార్మర్ న్యాయానికి, క్రిమినల్ న్యాయానికి చేసిన సేవలకు గాను దివంగత క్వీన్ ఎలిజబెత్-2 చేత నైట్ హుడ్ (knight hood) పొందారు. ఆయన 2015లో తొలిసారి లండన్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆయనకు ఇద్దరు సంతానం. ఆయన భార్య విక్టోరియా నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) లో ఉద్యోగిగా ఉన్నారు.
లేబర్ పార్టీ రాత మార్చారు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత లేబర్ పార్టీ అదృష్టాన్ని మార్చిన ఘనత సర్ కెయిర్ స్టార్మర్ కు దక్కుతుంది. కశ్మీర్ విషయంలో భారత వ్యతిరేక వైఖరి కారణంగా బ్రిటన్ లోని భారతీయులు మాజీ నేత జెరెమీ కార్బిన్ హయాంలో లేబర్ పార్టీకి దూరమయ్యారు. తిరిగి వారిని లేబర్ పార్టీకి దగ్గర చేయడం కోసం కెయిర్ స్టార్మర్ ప్రవాస భారతీయులతో పార్టీ సంబంధాలను పునర్నిర్మించారు.
భారత్ తో సంబంధాలు..
భారతదేశంలో మెరుగైన సంబంధాలను కెయిర్ స్టార్మర్ ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచ భద్రత, వాతావరణ భద్రత, ఆర్థిక భద్రత ప్రాతిపదికన భారత్ తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నారు. ‘‘నా లేబర్ ప్రభుత్వం భారతదేశంతో పటిష్టమైన సంబంధాలను కోరుకుంటోంది. ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడిన సంబంధాలను. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) కోరుకుంటోంది. ప్రపంచ భద్రత, వాతావరణ భద్రత, ఆర్థిక భద్రత కోసం కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా భారత్ తో కోరుకుంటున్నాం’’ అని చెప్పారు.
మేనిఫెస్టోలో కూడా భారత్ ప్రస్తావన
కెయిర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భారతదేశంతో సంబంధాల విషయమై ప్రస్తావన ఉంది. "స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో సహా భారతదేశంతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరడానికి, అలాగే భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం’’ అని అందులో పేర్కొన్నారు.
హిందూ ఆలయ సందర్శన
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర లండన్ లోని కింగ్స్ బరీలోని శ్రీ స్వామి నారాయణ్ ఆలయాన్ని కూడా కెయిర్ స్టార్మర్ సందర్శించారు. ఈ సందర్భంగా, ఆయన బ్రిటన్ లో హిందూఫోబియాకు తావులేదని హిందూ సమాజానికి హామీ ఇచ్చారు. కెయిర్ స్టార్మర్ (Keir Starmer) తండ్రి టూల్ మేకర్. అతని తల్లి నర్సు. అతను సర్రే యొక్క ఆక్స్టెడ్ లో పెరిగాడు. ఆయన ఎంపీ అయిన కొన్ని వారాలకే ఆయన తల్లి జోసెఫిన్ 2015లో స్టిల్స్ వ్యాధితో మరణించారు.
ఆక్స్ ఫర్డ్ స్టుడెంట్
కెయిర్ స్టార్మర్ (Keir Starmer) ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. లేబర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ (DPP) గా నియమితులయ్యారు. అతనికి సాకర్ అంటే చాలా ఇష్టం. లేబర్ పార్టీ మొదటి నాయకుడు కెయిర్ హార్డీ పేరు మీద ఆయనకు ఈ పేరు పెట్టారు. యుక్త వయస్సులో తాము ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన తన ప్రచారంలో తరచూ మాట్లాడేవారు. తన కుటుంబంలో కళాశాల విద్యను అభ్యసించిన మొదటి వ్యక్తి కూడా స్టార్మరే కావడం విశేషం.