UK Elections 2024 : రిషి సునక్‌కు గుడ్ బై చెప్పిన యూకే ప్రజలు.. లేబర్ పార్టీకి భారీ విజయం!
యూకే ఎన్నికల్లో రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ప్రటించారు. 14ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.
బ్రిటన్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం! 14ఏళ్ల పాటు సుదీర్ఘ పాలన సాగించిన కన్జర్వేటివ్ పార్టీ, 2024 యూకే ఎన్నికల్లో దారుణ ఓటమికి అడుగు దూరంలో నిలిచింది. జులై 4న ఎన్నికలు జరగ్గా, ఒక్కొక్కటిగా వెలువడుతున్న ఫలితాల్లో విపక్ష లేబర్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య తన ప్రధాని పదవికి రిషి సునక్ రాజీనామా చేయనున్నారు. ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.
‘క్షమించండి.. నాదే బాధ్యత..’
యూకేలో 650 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. మెజారిటీ మార్క్ 326ని ఇప్పటికే దాటేసింది లేబర్ పార్టీ. తాజా సమాచారం ప్రకారం కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 350కిపైగా సీట్లల్లో విజయం సాధించింది.
కన్జర్వేటివ్ పార్టీ మాత్రం 100 కన్నా తక్కువ సీట్లలోనే ప్రస్తుతం ఉంది. ఈ వ్యవహారంపై ప్రధాని రిషి సునక్ స్పందించారు.
"2024 యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. సర్ కీర్ స్టార్మర్‌కి శుభాకాంక్షలు. ఈరోజు, అధికార బదిలీ అనేది ప్రశాంతం, ప్రజల మంచిని కోరుకునే విధంగా జరుగుతుంది. మన దేశ స్థిరత్వం, భవిష్యత్తుకు ఇది చిహ్నంగా నిలుస్తుంది," అని సునక్ అన్నారు.
"ఈ ఓటమికి నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. క్షమాపణలు," అని రిషి సునక్ స్పష్టం చేశారు.
2010 తర్వాత తొలిసారిగా లేబర్ పార్టీ అధికారంలోకి రానుంది. కీర్ స్టార్మర్ ప్రధాని అవ్వనున్నారు. కానీ పాలన అంత సులభంగా ఉండకపోవచ్చు. కన్జర్వేటివ్ పార్టీని దారుణంగా ఓడించిన ప్రజలు.. లేబర్ పార్టీ ప్రభుత్వంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, ప్రజా సేవల్లో జాప్యం, జీవన ప్రమాణాల పతనం, నిరుద్యోగం వంటి అంశాలు బ్రిటన్‌ని వెంటాడుతున్న సమయంలో.. వాటిని కొత్త ప్రభుత్వం ఏలా డీల్ చేస్తుందో చూడాలి.
బ్రిటన్‌లో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆ స్థాయిలో ప్రజలపై పన్ను భారం ఉండటం ఇదే తొలిసారి! అనేక సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ కారణాల వల్లే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. అందుకే నూతన ప్రభుత్వానికి, 10 డౌనింగ్ స్ట్రీట్ సవాళ్లతో స్వాగతం పలుకుంది.
లేబర్ పార్టీ కూడా భారీ వాగ్దానాలతో ప్రచారాలు చేసింది. మరి పని తీరు ఎలా ఉంటుందో చూడాలి.
'యూకే భవిష్యత్తు తిరిగొచ్చింది'
యూకే ఎన్నికల ఫలితాలపై లేబర్ పార్టీ నేత, బ్రిటన్‌కి కాబోయే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు.
"ధన్యవాదాలు. మీరు మన దేశాన్ని మార్చేశారు. కానీ ఇలాంటి ఫలితాలు మా మీద బాధ్యతను పెంచుతాయి. ఈరోజు కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నాము. దేశాన్ని పునర్మించాలి. ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలి. ప్రభుత్వం మంచి చేయగలదు అని నిరూపించారు. ఈరోజున యూకే భవిష్యత్తు తిరిగొచ్చింది," అని కీర్ స్టార్మర్ అన్నారు.
అయితే, కీర్ స్టార్మర్ పాలనలో బ్రిటన్- భారత్ సంబంధం బలపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల వేళ ఆయన భారత్‌తో బంధంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత్‌తో సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తామన లేబర్ పార్టీ మేనిఫెస్టోలో కూడా స్పష్టం చేశారు. అంటే.. ఇండియాతో ట్రేడ్ ఒప్పందాలు మరింత వేగంగా జరిగే అవకాశాలు లేకపోలేదు. యూకేలో భారత సంతతి ప్రజలను ఆకర్షించేందుకు సైతం ప్రయత్నించారు కీర్ స్టార్మర్.
సంబంధిత కథనం