Rishi Sunak: యూకేలో నేడే పోలింగ్; రిషి సునక్ పార్టీ గెలుస్తుందా?
Rishi Sunak: బ్రిటన్ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్ కు ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 650 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. ప్రధాని, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ కన్సర్వేటివ్ పార్టీ, ఆయన ప్రత్యర్థి కీర్ స్టార్మర్ కు చెందిన లేబర్ పార్టీ ప్రధానంగా బరిలో ఉన్నాయి.
Rishi Sunak: గూగుల్ లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అందుకు కారణం, జూలై 4న బ్రిటన్ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రిషి సునక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందా? అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. బ్రిటన్ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్ లోని మొత్తం 650 సీట్లకు జులై 4న పోలింగ్ జరుగుతుంది. ప్రధాని, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ, ఆయన ప్రత్యర్థి కీర్ స్టార్మర్ కు చెందిన లేబర్ పార్టీ ప్రధానంగా బరిలో ఉన్నాయి.
కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీలదే ఆధిపత్యం
బ్రిటన్ (Britain) రాజకీయ ముఖచిత్రంలో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీలే మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ 14 సంవత్సరాలలో ఐదుగురు వేర్వేరు ప్రధానమంత్రులు బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ రెండు పార్టీలే కాదు..
ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ల్లోని 650 నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో మెజారిటీకి 326 మంది అవసరం. కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ ఎన్ పీ), ఎస్ డీఎల్ పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ), సిన్ ఫియాన్, ప్లాయిడ్ సైమ్రు, యాంటీ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పార్టీ బరిలో ఉన్నాయి. అలాగే పలువురు అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
పోలింగ్ ప్రారంభం
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు దేశవ్యాప్తంగా 40,000 పోలింగ్ కేంద్రాలు తెరుచుకోగా, 46 మిలియన్ల రిజిస్టర్డ్ ఓటర్లు పేపర్ బ్యాలెట్ లో తాము ఎన్నుకున్న అభ్యర్థి పక్కన క్రాస్ ను గుర్తించడం ప్రారంభించారు. ఈ సంవత్సరం నుండి, యూకే ఎన్నికలలో పోలింగ్ బూత్ కు గుర్తింపు పత్రాన్ని తీసుకెళ్లడం తప్పనిసరి చేశారు. ఇప్పటికే పలువురు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు పోలింగ్ బూత్ లను అధికారికంగా మూసివేస్తారు. ఆ తర్వాత, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్తాయి.
గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్
గురువారం భారతదేశంలో గూగుల్ (Google) రియల్ టైమ్ ట్రెండ్స్ లో "రిషి సునక్" అనే కీవర్డ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. కన్జర్వేటివ్ పార్టీ భవితవ్యాన్ని బ్రిటన్ నిర్ణయించడంతో ఈ ఏడాది జూన్ 27న మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన ఆసక్తి జూలై 4న తారాస్థాయికి చేరింది. కన్సర్వేటివ్ నేత లిజ్ ట్రస్ నేతృత్వంలోని ప్రభుత్వం కొంతకాలం మనుగడ సాగించిన తర్వాత.. రిషి సునక్ బ్రిటన్ (Britain) ప్రధాని పదవి చేపట్టారు. ఇప్పుడు రెండోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ లో శ్వేతజాతీయేతర ప్రధానిగా రిషి సునక్ (Rishi Sunak) గుర్తింపు పొందారు.