TGSPDCL Power Bills : విద్యుత్ వినియోగదారులకు అలర్ట్- ఫోన్ పే గూగుల్ పేలో కరెంట్ బిల్లుల చెల్లింపు నిలిపివేత
TGSPDCL Power Bills : సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులను టీజీఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే సర్వీస్ ప్రొవైడర్ల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

TGSPDCL Power Bills : విద్యుత్ బిల్లుల చెల్లింపులపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన చేసింది. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లను టీజీఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులను బ్యాంకులు నిలిపివేశాయి. టీజీఎస్పీడీసీఎల్ వెబ్ సైట్, యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు వినియోగదారులను విజ్ఞప్తి చేశారు.
"ప్రియమైన వినియోగదారులారా, RBI ఆదేశాల ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్లు అనగా PhonePe, Paytm, Amazon Pay, Google Pay, బ్యాంకులు జులై 1 నుంచి టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేశాయి. అందువల్ల వినియోగదారులందరూ గమనించి టీజీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులను చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం"- అని టీజీఎస్పీడీసీఎల్ ఎక్స్ లో పోస్టు చేసింది. విద్యుత్ వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను https://tgsouthernpower.org/paybillonline వెబ్‌సైట్ ద్వారా కట్టాలని టీజీఎస్పీడీసీఎల్ సూచించింది.
మీ విద్యుత్ బిల్లు మీరే కాలిక్యులేట్ చేసుకోవచ్చు
మీ కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మేం తక్కువగానే వాడుతున్నాం కదా! అయినా కూడా ఇంత బిల్లు వచ్చిందని భావిస్తున్నారా? అసలు ఈ బిల్లులను ఏ ప్రతిపాదికన వేస్తున్నారు? వంటి అనుమానులు వినియోగదారుడికి ఉంటాయి. ఇదే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు అధికారులను కూడా సంప్రదిస్తుంటారు. ఇలాంటి అనుమానాలకు చెక్ పెట్టడంతో పాటు విద్యుత్ వినియోగదారులకు పారదర్శమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో అధికారులు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. డిస్కం వెబ్ సైట్ లో డిజిటల్ కాలిక్యులేటర్ ఆప్షన్ ను తీసుకొచ్చారు. ఈ సదుపాయాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
డొమెస్టిక్ కస్టమర్స్ కరెంటు వాడకం బిల్లు చెక్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ పని చేస్తుంది. ఇందుకోసం వినియోగదారులు https://tgsouthernpower.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇందులో ఎనర్జీ చార్జెస్ క్యాలిక్యూలేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి… మీటర్ రీడింగ్ వివరాలను ఎంట్రీ చేస్తే మీ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఎన్ని రోజులకు బిల్లింగ్ అయింది..? రీడింగ్ తీసిన తేదీలను సరిపొల్చుకోవచ్చు. ఫలితంగా నమోదైన కరెంట్ బిల్లు సరైనదేనా లేదా అనే దానిపై అంచనాకు రావొచ్చు. యూనిట్ల వివరాలను కాలిక్యులేటర్‌లో నమోదుచేస్తే బిల్లింగ్ రోజులు, ఎంత ఛార్జీ వేశారనే వివరాలు కూడా తెలుస్తాయని TGSPDCL సీఎండీ తెలిపారు.
సంబంధిత కథనం