Door Delivery Result: డోర్‌ డెలివరీకి తగిన గుణపాఠం, అదను కోసం ఎదురు చూసిన ఓటర్లు, తుడుచుకుపోయిన వైసీపీ రిజర్వ్‌ స్థానాలు-a fitting lesson for door delivery of driver body voters wiped out ycp reserved seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Door Delivery Result: డోర్‌ డెలివరీకి తగిన గుణపాఠం, అదను కోసం ఎదురు చూసిన ఓటర్లు, తుడుచుకుపోయిన వైసీపీ రిజర్వ్‌ స్థానాలు

Door Delivery Result: డోర్‌ డెలివరీకి తగిన గుణపాఠం, అదను కోసం ఎదురు చూసిన ఓటర్లు, తుడుచుకుపోయిన వైసీపీ రిజర్వ్‌ స్థానాలు

Sarath chandra.B HT Telugu
Jun 05, 2024 09:37 AM IST

Door Delivery Result: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి ఎస్సీ ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. ఏ వర్గాలైతే తన ఓటు బ్యాంకులుగా జగన్ భావించాడో ఆ స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఎస్సీ, ఎస్టీలు తన వైపే ఉంటారన్న నమ్మకాన్ని ఓటర్లు వమ్ము చేశారు.

వైసీపీ సీట్లు గల్లంతు చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం
వైసీపీ సీట్లు గల్లంతు చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం

Door Delivery Result: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రంపచోడవరం నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష దేవి విజయం సాధించారు. టీడీపీ తరపున పోటీ చేసిన శిరీషా దేవి 9139 ఓట్లతో విజయం సాధించారు. వైసీపీ తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మీ ఓటమి పాలయ్యారు.

ఏజెన్సీ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రజలపై పెత్తనం చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు దుర్మార్గానికి ప్రజలు ఓటుతో తీర్పు చెప్పారు. రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీకు అధికార పార్టీ కొమ్ముకాయడంపై రగిలిపోయిన ఓటర్లు ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. రంపచోడవరం నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నికైనా స్థానికంగా పెత్తనం మాత్రం అనంతబాబు చేతుల్లోనే ఉండేది. 2022 జులైలో కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే అతని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.

ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్య తర్వాత నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించడం, కనీసం అరెస్ట్‌ కూడా చేయకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది.

ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబు వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్య చేశానని స్వయంగా అనంతబాబు పోలీసుల విచారణలో అంగీకరించినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొదట్లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించినా ఆ తర్వాత ఆ సంగతి గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి పర్యటనల్లో సిఎం జగన్ స్వయంగా అనంతబాబును బహిరంగ వేదికలపై తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.

అనంతబాబు విషయంలో ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై దళిత సంఘాలు, వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. దళితుడిని చంపేసి ఇంటి ముందు పడేసిన నిందితుడికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై విస్తృత ప్రచారం జరిగింది. దాని ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది.ఎన్నికల్లో దళిత సంఘాలు ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి.

అనంతబాబు హత్య వ్యవహారంతో పాటు పీజీ ఫీజుల రియింబర్స్‌మెంట్‌ రద్దు నిర్ణయం, విదేశీ విద్యా సాయం రద్దు, స్వయం ఉపాధి రుణాల రద్దు వంటి అంశాలపై అయా వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది.

ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు గతంలో అమలు చేసిన పథకాల్లో జరిగిన కోతలపై విస్తృత చర్చ జరిగింది. వీటికంటే ఎక్కువగా అనంతబాబు వ్యవహారం ఎస్సీ ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో దళిత ఐఏఎస్‌ అధికారుల పక్కనే అనంతబాబును వేదికపై కూర్చోబెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వ్యవహారం ఉద్యోగ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.

ఫలితంగా గత ఎన్నికల్లో ఏ వర్గాలైతే వైసీపీకి అండగా నిలబడ్డాయో వారంతా ఈసారి ఏకపక్షంగా తీర్పునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాల్లో వైసీపీని మట్టి కరిపించారు. ఏపీలో 29 రిజర్వుడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటే వాటిలో 27 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 7 ఎస్టీ స్థానాల్లో 5చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు. రంపచోడవరంలో వైసీపీ గెలుపు ఖాయమని భావించినా చివరకు 9139 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలన్నింటిలో వైసీపీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి బలమైన అండగా నిలిచిన సామాజిక వర్గాలు ఈసారి టీడీపీ వెంట నడిచాయి.

27నియోజకవర్గాల్లో గెలుపు…

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు శాసనసభ నియోజకవర్గాల్లో 27 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ తరఫున పోటీ చేసిన వారంతా ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే ట్రెండ్ కనిపించింది.

రాజాం, పార్వతీపురం, పాయకరావుపేట, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, పామర్రు, తిరువూరు, నందిగామ, తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు, సంతనూతలపాడు, కొండపి, కోడుమూరు, నందికొట్కూరు, శింగనమల, మడకశిర, రైల్వేకోడూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో తెదేపా, మిత్రపక్షాలు విజయం సాధించాయి. యర్రగొండపాలెం, బద్వేలులో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు.

ఎస్టీ నియోజకవర్గాల్లో కూటమిదే గెలుపు..

వైసీపీకి గట్టి పట్టు ఉన్నా ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ ఓటమి పాలైంది. 7 ఎస్టీ శాసనసభ నియోజకవర్గాల్లో 5 చోట్ల కూటమి హవా కొనసాగింది. పాలకొండ, కురుపాం, సాలూరు, రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచారు. అరకు , పాడేరులో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించింది.

అనంతబాబును..చంద్రబాబు ఏం చేస్తారు?

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబును వైసీపీ కాపాడుతోందని పలు సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో డ్రైవర్‌ డోర్ డెలివరీ అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేయకపోవడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టారు.

ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అనంతబాబు విషయంలో ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందనే ఆసక్తికరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్ని గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్న అనంతబాబుకు అడ్డుకట్ట వేస్తారో లేదనేది ఆసక్తికరంగా మారింది. అనంతబాబు సమీప బంధువులు టీడీపీలో కూడా కీలక పదవుల్లో ఉండటంతో ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

WhatsApp channel

సంబంధిత కథనం