Russia Ukraine war : రష్యన్ సైనికుల వెన్నులో వణుకు పుట్టుస్తున్న ఉక్రెయిన్ వీరులు!
18 November 2022, 10:14 IST
- Ukraine soldiers killing Russian troops : రష్యన్ సైనికులను ఉక్రెయిన్ దళాలు మట్టుబెడుతున్న దృశ్యాలను ఆ దేశ రక్షణశాఖ విడుదల చేసింది.'మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాము,' అని హెచ్చరికలు జారీ చేసింది ఉక్రెయిన్.
రష్యన్ సైనికుల వెన్నులో వణుకు పుట్టుస్తున్న ఉక్రెయిన్ వీరులు!
Ukraine soldiers killing Russian troops : రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. గత దాదాపు 9 నెలల నుంచి జరుగుతోంది. ఉక్రెయిన్ సైనిక దళాన్ని చిన్న చూపు చూసిన రష్యా.. ఇప్పుడు పశ్చాతాపం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇది ఒకింత నిజమే! రష్యాతో యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్నారు ఉక్రెయిన్ సైనికులు. ఈ క్రమంలోనే రష్యన్ బృందంలో భారీగా మృతుల సంఖ్య నమోదవుతోంది. ఇక తాజాగా.. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉన్న ఓ వీడియోను విడుదల చేసింది ఉక్రెయిన్ రక్షణశాఖ. రష్యన్ సైనికులను.. ఉక్రెయిన్ బృందం వేటాడిన తీరు ఇందులో ఉంది.
'శాంతికి అర్థం తెలియకుండా చేస్తాము..'
ఉక్రెయిన్ సరిహద్దులో ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఐదుగురు రష్యన్ సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ సైన్యం చెబుతోంది. సరిహద్దును దాటుతూ ఉక్రెయిన్లోకి ప్రవేశించాలని భావించిన ఐదుగురు రష్యన్ సైనికులను.. ఉక్రెయిన్ దళం ఒక్కొక్కరిగా మట్టుబెట్టింది.
Russia Ukraine war : "వీ సీ యూ(మిమ్మల్ని చూస్తూనే ఉంటాము).. చీకటిలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టము. ఉక్రెయిన్ని విడిచేంత వరకు.. శాంతి అనే పదానికి మీకు అర్థం తెలియకుండా చేస్తాము," అని.. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో కింద క్యాప్షన్ ఇచ్చింది డిఫెన్స్ ఆఫ్ ఉక్రెయిన్.
ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉన్న వీడియో నిడివి 1 నిమిషం పాటు ఉంది. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. యుద్ధంలో ఇరువైపులా నష్టం జరుగుతోందని, తొందరగా దీనికి ముగింపు పడాలని మరికొందరు ప్రార్థిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి:
వరుస దాడులు..!
Russia Attack on Ukraine : రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు! పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారుతున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే ఏకంగా సుమారు 100 క్షిపణులను ఉక్రెయిన్‍పై లాంచ్ చేశాయి రష్యా బలగాలు. ముఖ్యంగా ఉక్రెయిన్‍కు విద్యుత్‍ను అందించే ఎనర్జీ మౌలిక సదుపాయాలను రష్యా టార్గెట్ చేసింది. మిసైళ్ల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో పాటు చాలా చోట్ల మిసైళ్లతో దాడులు చేసింది రష్యా వైమానికదళం. ఫలితంగా ఉక్రెయిన్‍లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటి మందికిపైగా ప్రజలు అంధకారంలో ఉండిపోయారు. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇండోనేషియాలోని బాలిలో ఓవైపు జీ20 సదస్సు జరుగుతున్న సమయంలోనే.. రష్యా చేపట్టిన ఈ దాడులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బాలిలో జరిగిన సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కాలేదు.