Russia-Ukraine War: ఉక్రెయిన్‍పై మళ్లీ రష్యా భీకర దాడి.. అంధకారంలో లక్షల మంది.. పోలండ్‍పైనా-russia launched around 100 missiles against ukraine ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia-ukraine War: ఉక్రెయిన్‍పై మళ్లీ రష్యా భీకర దాడి.. అంధకారంలో లక్షల మంది.. పోలండ్‍పైనా

Russia-Ukraine War: ఉక్రెయిన్‍పై మళ్లీ రష్యా భీకర దాడి.. అంధకారంలో లక్షల మంది.. పోలండ్‍పైనా

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 16, 2022 06:54 AM IST

Russia-Ukraine War: ఉక్రెయిన్‍పై రష్యా మరోసారి భీకరదాడులు చేసింది. సుమారు 100 మిసైళ్లను తాజాగా ప్రయోగించింది. ఇక రష్యా క్షిపణి.. పోలండ్‍లో పడడం కీలక విషయంగా మారింది. దీనిపై నాటో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.

Russia-Ukraine War: ఉక్రెయిన్‍పై మళ్లీ రష్యా భీకర దాడి.. అంధకారంలో లక్షల మంది
Russia-Ukraine War: ఉక్రెయిన్‍పై మళ్లీ రష్యా భీకర దాడి.. అంధకారంలో లక్షల మంది (AFP)

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ ఉద్రిక్తమైంది. ఉక్రెయిన్‍పై రష్యా మరోసారి విరుచుకపడింది. భీకర దాడితో బెంబేలెత్తించింది. ఒక్కరోజులోనే ఏకంగా సుమారు 100 క్షిపణులను ఉక్రెయిన్‍పై లాంచ్ చేశాయి రష్యా బలగాలు. ముఖ్యంగా ఉక్రెయిన్‍కు విద్యుత్‍ను అందించే ఎనర్జీ మౌలిక సదుపాయాలను రష్యా టార్గెట్ చేసింది. మిసైళ్ల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో పాటు చాలా చోట్ల మిసైళ్లతో దాడులు చేసింది రష్యా వైమానికదళం.

Russia attack on Ukraine: అంతా అంధకారం

విద్యుత్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా మిసైళ్లతో దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్‍లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటి మందికిపైగా ప్రజలు అంధకారంలో ఉండిపోయాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఉక్రెయిన్ అధికారులు పని చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇళ్లకు విద్యుత్ పునరుద్ధరణ జరిగినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీ చెప్పారు. అయితే ఇప్పటికీ లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు చీకటిలోనే మగ్గుతున్నారు. ఈ తాజా వైమానిక క్షిపణి దాడులతో జరిగిన పూర్తి నష్టం గురించి ఇంకా స్పష్టత రావాల్సిఉంది.

Russia missile on Poland: గీతదాటి పోలండ్‍లో..

ఉక్రెయిన్‍పై రష్యా సుమారు వంద మిసైళ్లను ప్రయోగించిందని తెలిసింది. అయితే సమీపంలోనే ఉన్న పోలండ్‍లోనూ రష్యాకు చెందిన మిసైల్ పడింది. ఈ విషయాన్ని పోలండ్ ప్రభుత్వం ప్రకటించింది. రష్యా మిసైల్ దాడిలో తమ దేశానికి చెందిన ఇద్దరు చనిపోయారని వెల్లడించింది. ఈ విషయంపై తమ దేశంలోని రష్యా అంబాసిడార్ కు పోలండ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై నాటో కూడా ఎమర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.

“రష్యా ఫెడరేషన్‍కు చెందిన సాయుధ దళాలు.. ఉక్రెయిన్‍పై మరోసారి భారీ దాడులు చేశాయి. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన మిసైల్.. హ్రూబిస్‍జో డిస్ట్రిక్‍లోని ర్జెవొడో గ్రామంపై పడింది. ఈ ఘటనలో పోలండ్ రిపబ్లిక్‍కు చెందిన ఇద్దరు పౌరులు మరణించారు” అని పోలండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని పోలండ్‍లోని రష్యా అంబాసిడార్ ను ఆదేశించింది.

ఇండోనేషియాలోని బాలిలో ఓవైపు జీ20 సదస్సు జరుగుతుండగా.. రష్యా చేపట్టిన ఈ తాజా దాడులు చర్చనీయాంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని వివిధ దేశాధ్యక్షులు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) మాత్రం తాజా దాడులతో తాము తగ్గేది లేదని సంకేతాలు పంపినట్టయింది.

Whats_app_banner