తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ajit Pawar : ‘బీజేపీతో కలిస్తే తప్పేంటి? ఎన్​సీపీ మొత్తం నావెంటే ఉంది!’- అజిత్​ పవార్​

Ajit Pawar : ‘బీజేపీతో కలిస్తే తప్పేంటి? ఎన్​సీపీ మొత్తం నావెంటే ఉంది!’- అజిత్​ పవార్​

Sharath Chitturi HT Telugu

07 August 2023, 15:37 IST

google News
    • Ajit Pawar Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్​ భవన్​లో అజిత్​ పవార్​ ప్రమాణం
రాజ్​ భవన్​లో అజిత్​ పవార్​ ప్రమాణం

రాజ్​ భవన్​లో అజిత్​ పవార్​ ప్రమాణం

Ajit Pawar Maharashtra : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపై నమ్మకంతోనే తాను మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరినట్టు ప్రకటించారు ఎన్​సీపీ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​. శివసేనతో కలిసి పనిచేయగా లేనిది, బీజేపీతో కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు.

'ఎన్​సీపీ మొత్తం నావెంటే ఉంది..'

తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ప్రభుత్వంలో కలిశారు అజిత్​ పవార్​. రాజ్​ భవన్​లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఉన్న పలువురు ఎన్​సీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అజిత్​ పవార్​.

"ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇతర దేశాల్లో కూడా ఆయన పాప్యులర్​ అయ్యారు. ఆయనకు మద్దతు లభిస్తోంది. 2024 లోక్​సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తాము. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు చాలా మంది మమ్మల్ని విమర్శిస్తారు. మేము పట్టించుకోము. మహారాష్ట్ర అభివృద్ధికే మేము పనిచేస్తాము. మా ఎమ్మెల్యేలు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. నాగాలండ్​లో ఎన్​సీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండేవారు. పార్టీ నిర్ణయంతో వారందరు బీజేపీతో చేరారు. నాగాలాండ్​లో చేసింది, మహారాష్ట్రలో ఎందుకు చేయలేరు? శివసేనతో కలిసి పనిచేయగా లేదని బీజేపీతో కలిస్తే తప్పేముందు?" అని అజిత్​ పవార్​ వ్యాఖ్యానించారు.

తనకు ఎన్​సీపీలో అందరు ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు అజిత్​ పవార్​.

"కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడలేకపోయాము. వారు విదేశాల్లో ఉన్నారు. మిగిలిన వారు మా నిర్ణయానికి మద్దతిచ్చారు. ఎన్​సీపీ పెద్దలకు కూడా ఈ విషయాన్ని చెప్పాము. మా దగ్గర నంబర్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలందరు మాతోనే ఉన్నారు. ఇక్కడికి మేము పార్టీగానే వచ్చాము. పార్టీని చీల్చే ఉద్దేశం మాకు లేదు. ప్రజాస్వామ్యానికి మెజారిటీ లభించింది. మా పార్టీకి 24ఏళ్లు నిండాయి. నూతన నాయకత్వం అవసరం ఉంది," అని అజిత్​ పవార్​ అభిప్రాయపడ్డారు.

రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పోర్ట్​ఫోలియోలను త్వరలోనే వెల్లడిస్తామని పవార్​ అన్నారు.

ప్రధాని మోదీపై శరద్​ పవార్​ సెటైర్లు..

Sharad pawar on Ajit Pawar : అజిత్​ పవార్​ తాజా నిర్ణయంపై ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ స్పందించారు.

"ఎన్​సీపీ గురించి రెండు రోజుల క్రితం ప్రధాని మాట్లాడారు. ఎన్​సీపీ పని అయిపోయిందన్నారు. ఎన్​సీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మా పార్టీలోని కొందరు ప్రమాణస్వీకారం చేశారు. ఎన్​డీఏ ప్రభుత్వంతో కలవడంతో వారిపై ఉన్న ఆరోపణలు తొలగిపోతాయి. నాకు సంతోషంగా ఉంది. మోదీకి ధన్యవాదాలు," అని శరద్​ పవార్​ వెల్లడించారు.

"మా బృందంలో కొందరు భిన్నంగా ఆలోచించారు. జులై 6న పార్టీ సమావేశానికి పిలుపునిచ్చాను. కీలక విషయాలపై చర్చించాల్సి ఉంది. కానీ ఈలోపే కొందరు ప్రభుత్వంతో చేతులు కలిపారు," అని శరద్​ పవార్​ పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితులు తనకు కొత్తేమీ కాదన్నారు రాజకీయ దిగ్గజం శరద్​ పవార్​.

"ఇది నాకు కొత్త విషయం కాదు. 1980లో పార్టీ లీడింగ్​లో ఉంది. 58ఎమ్మెల్యేలు ఉండేవారు. ఆ తర్వాత ఆరుగురు తప్పించి అందరు వెళిపోయారు. నేను పార్టీని తిరిగి నిలబెట్టాను. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన వారందరు తర్వాత ఓడిపోయారు," అని శరద్​ పవార్​ తెలిపారు.

తాజా పరిణామాలతో తనకు ఆందోళన ఏం లేదన్న శరద్​ పవార్​.. సోమవారం బహిరంగ సభను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం