తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sharad Pawar: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా సుప్రియా సూలె, ప్రఫుల్ పటేల్; అజిత్ పవార్ రియాక్షన్ ఇదే..

Sharad Pawar: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా సుప్రియా సూలె, ప్రఫుల్ పటేల్; అజిత్ పవార్ రియాక్షన్ ఇదే..

HT Telugu Desk HT Telugu

10 June 2023, 20:56 IST

google News
  • Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. వారిలో ఒకరు తన కూతురు సుప్రియ సూలె కాగా, మరొకరు సీనియర్ నేత ప్రఫుల్ పటేల్.

కూతురు సుప్రియ సూలె తో శరద్ పవార్ (ఫైల్ ఫొటో)
కూతురు సుప్రియ సూలె తో శరద్ పవార్ (ఫైల్ ఫొటో)

కూతురు సుప్రియ సూలె తో శరద్ పవార్ (ఫైల్ ఫొటో)

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలో పార్టీ చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. వారిలో ఒకరు తన కూతురు సుప్రియ సూలె కాగా, మరొకరు సీనియర్ నేత ప్రఫుల్ పటేల్. పార్టీలో మరో ప్రధాన అధికార కేంద్రమైన అజిత్ పవార్ సమక్షంలోనే శరద్ పవార్ ఈ ప్రకటన చేయడం విశేషం. అజిత్ పవార్, సుప్రియ సూలె మధ్య ఎన్సీపీపై ఆధిపత్య పోరు నడుస్తోందన్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. సుప్రియ సూలె, ప్రఫుల్ పటేల్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించాలన్న నిర్ణయంలో అజిత్ పవార్ కూడా ఒక భాగస్వామేనని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

2 working chiefs to NCP: గత 24 ఏళ్లుగా పవారే పార్టీలో ఏకైక పవర్ సెంటర్..

దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్ ను వీడి.. ఎన్సీపీ ని స్థాపించిన నాటి నుంచి.. గత 24 ఏళ్లుగా శరద్ పవార్ ఆ పార్టీకి ఏకైక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను నియమించలేదు. ఎన్సీపీని శరద్ పవార్ 1999 జూన్ 10న స్థాపించారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ సంవత్సరం మే 3వ తేదీన పవార్ ఒక ప్రకటన చేశారు. కానీ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా, జూన్ 10న పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించకుండా, తన కూతురు సుప్రియ సూలె, మరో సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ లకు ఆ అవకాశం ఇచ్చారు. అంతేకాదు, సుప్రియ సూలె కు పార్టీకి అత్యంత ముఖ్యమైన మహారాష్ట్రలో పార్టీ బాధ్యతలను అప్పగించారు. పంజాబ్, హరియాణా పార్టీ బాధ్యతలను కూడా సుప్రియ నిర్వర్తిస్తారు. ప్రఫుల్ పటేల్ కు మధ్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, జార్ఖండ్, గోవాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు.

Ajit pawar reaction: అజిత్ పవార్ రియాక్షన్

సుప్రియ సూలె, ప్రఫుల్ పటేల్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించడంపై అజిత్ పవార్ స్పందించారు. శరద్ పవార్ ఈ ప్రకటన చేసిన సమయంలో అక్కడే ఉన్న అజిత్ పవార్.. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రశ్నలకు జవాబివ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సుప్రియ సూలె, ప్రఫుల్ పటేల్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉన్నానని ఆ ప్రకటనలో తెలిపారు. వారి నియామకంపై సంతోషంగా ఉన్నానని చెబుతూ.. ఆ నిర్ణయంపై హ్యాప్పీ అంటూ ఆయన స్పందించారు.

తదుపరి వ్యాసం