TCS: దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‍లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందా.. లేదా? సమాధానం ఇచ్చిన ఉన్నతాధికారి
19 February 2023, 18:15 IST
- TCS: ఉద్యోగుల తొలగింపు (Layoff) ఉంటుందా లేదా అన్న విషయానికి టీసీఎస్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు సమాధానం చెప్పారు. ఉద్యోగుల జీతం పెంపు విషయం కూడా స్పందించారు.
TCS: దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‍లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందా.. లేదా?
TCS: ప్రస్తుతం ప్రపంచమంతా లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ నడుస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్‍తో పాటు చాలా సంఖ్యలో సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి (Layoffs). వివిధ కారణాలు చెబుతూ ఎంప్లాయిస్‍ను తీసేస్తున్నాయి. కొన్ని భారతీయ సంస్థలు కూడా వేలాది మందికి ఉద్వాసన చెప్పాయి. ఈ క్రమంలో ఉద్యోగాల తొలగింపు అంశంపై దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు చెందిన ఓ ఉన్నతాధికారి స్పందించారు. న్యూస్ ఏజెన్సీ పీటీఐతో ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దేశంలో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ ఎక్స్‌పోర్టర్‌గా ఉన్న టీసీఎస్ ఉద్యోగాల తొలగింపును పరిగణించడం లేదని స్పష్టం చేశారు. అంటే టీసీఎస్‍లో ఉద్యోగుల తీసివేత ఉండదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు వెల్లడించారు.
మేం ఆ విషయాన్ని నమ్ముతాం
TCS: టీసీఎస్‍లో ఉద్యోగుల తొలగింపు (Layoff) ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా టీసీఎస్ చీఫ్ హ్యుమన్ రీసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ (Milind Lakkad) స్పష్టం చేశారు. “మేం ఆ పని (లేఆఫ్స్) చేయం. ఈ కంపెనీలో టాలెంట్‍ను వృద్ధి చేయడాన్నే మేం నమ్ముతాం” అని ఆయన అన్నారు. అవసరానికి మించి నియామకాలు చేసుకోవడం వల్లే చాలా కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీసీఎస్‍లో ఉద్యోగి ఒక్కసారి జాయిన్ అయితే.. ఆ ఉద్యోగిని ప్రొడక్టివ్‍గా, కీలకంగా మార్చడం కంపెనీ బాధ్యత అని టీసీఎస్ నమ్ముతుంది” అని లక్కడ్ చెప్పారు. కావాల్సిన స్కిల్ సెట్, ఉద్యోగులకు ఉన్న స్కిల్స్ మధ్య అంతరం ఉంటే.. ట్రైనింగ్ ఇచ్చి వారికి సమయం ఇస్తామని పేర్కొన్నారు.
ముందులానే హైక్స్
TCS Employees Hike: టీసీఎస్ సంస్థలో 6లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారని చీఫ్ హెచ్‍ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్రితం సంవత్సరాల్లాగానే ఉద్యోగులకు ఈసారి కూడా జీతాల పెంపు (Salary Hike) ఉంటుందని ఆయన అన్నారు. త్వరలోనే హైక్స్ ఉంటాయనేలా సంకేతాలు ఇచ్చారు.
యూజర్ ఎక్స్‌పీరియన్స్ (UX) డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ విభాగాల్లో టాలెంట్ కోసం తాము చూస్తున్నామని ఆయన చెప్పారు. కొత్తగా ఉద్యోగులను నియమించుకోని కారణంగానే డిసెంబర్ క్వార్టర్లో స్టాఫ్ సంఖ్య గత క్వార్టర్ కంటే 2,000 తక్కువగా కనిపించేందుకు కారణమని వివరించారు. కాగా, వివిధ కంపెనీల్లో పని చేస్తూ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను అక్కడ టీసీఎస్ నియమించుకుంటోందని లక్కడ్ వెల్లడించారు.
ప్రస్తుతం తమ సిబ్బందిలో 40 శాతం మంది వారానికి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారని, 60 శాతం మంది వారానికి రెండుసార్లు ఆఫీస్‍లకు వస్తున్నారని చెప్పారు.
టాపిక్