TOEFL: టోఫెల్ పై యూఎస్ వర్సిటీల కీలక నిర్ణయం; ఇండియన్ స్టడీ పార్ట్ నర్స్ ద్వారా టోఫెల్ స్కోర్స్ వాలిడేషన్
13 March 2024, 16:42 IST
TOEFL: యుఎస్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు భారతీయ అధ్యయన-విదేశీ భాగస్వాముల ద్వారా టోఫెల్ టెస్ట్ స్కోర్లను ధృవీకరించవచ్చు. ఈ నిర్ణయం టోఫెల్ స్కోర్ తో విదేశీ వర్సిటీల్లో ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్నవారికి ఉపయోగపడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
TOEFL: అమెరికాలోని యూనివర్సిటీలు ఇకపై తమ భారతీయ స్టడీ-ఓవర్సీస్ భాగస్వాముల (Indian study-abroad partners) ద్వారా టోఫెల్ టెస్ట్ స్కోర్లను ధృవీకరించుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) తెలిపింది. ప్రిన్స్ టన్ కు చెందిన ఈటీఎస్ టోఫెల్ (TOEFL), జీఆర్ఈ (GRE) వంటి పరీక్షలను నిర్వహిస్తుంది. తాజాగా, ఈ సంస్థ స్కోర్ వెరిఫికేషన్ కోసం కెరీర్ మొజాయిక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కెరీర్ మొజాయిక్ (Career Mosaic) అమెరికా విశ్వవిద్యాలయాలకు ప్రముఖ స్టూడెంట్ రిక్రూటర్ గా ఉంది.
ఎవరికి ఉపయోగం?
ఆథరైజ్డ్ భారతీయ -ఓవర్సీస్ స్టడీ భాగస్వాములు (Indian study-abroad partners) ధ్రువీకరించిన టోఫెల్ స్కోర్ లను అమెరికా వర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటాయి. దీనివల్ల ఆయా యూనివర్సిటీలపై ఈ స్కోర్లకు సంబంధించిన పని భారం తగ్గుతుంది. విద్యార్థుల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుంది. ఆయా వర్సిటీలకు అందిన విద్యార్థి ప్రొఫైల్స్ విశ్వసనీయతను ఈ ధ్రువీకరణలు గణనీయంగా పెంచుతాయి.
ఏమిటీ టోఫెల్?
టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ (TOEFL) అనేది ఇంగ్లీష్ మాట్లాడే విశ్వవిద్యాలయాలలో చేరాలనుకునే స్థానికేతరుల ఆంగ్ల భాషా సామర్థ్యాలను నిర్ధారించడానికి పెట్టే ఒక ప్రామాణిక పరీక్ష. ఈ పరీక్షను 160 దేశాలలోని 12,000 కంటే ఎక్కువ విద్యాసంస్థలు గుర్తించాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేె వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఈ స్కోర్ ను తమ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. విద్యార్థుల టోఫెల్ స్కోర్ల ను ధృవీకరించడానికి కెరీర్ మొజాయిక్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తమకు సంతోషంగా ఉందని ఇటీఎస్ ఇండియా, దక్షిణాసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ అన్నారు. టోఫెల్ లో ఈటీఎస్ పలు మార్పులు చేసింది. పరీక్ష వ్యవధిని మూడు గంటలకు బదులు రెండు గంటలకు తగ్గించడం, పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ అధికారిక స్కోర్ విడుదల తేదీని చూడటానికి అనుమతించడం. మొదలైనవి వాటిలో ఉన్నాయి.