Janasena Nadendla On TOEFL: టోఫెల్ శిక్షణ పేరుతో ప్రజాధనం లూటీ అంటున్న నాదెండ్ల
Janasena Nadendla On TOEFL: ‘టోఫెల్ విద్యా పథకం పేరుతో మరోసారి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి.. పన్నులు చెల్లించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు టోపీ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
Janasena Nadendla On TOEFL: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేద పిల్లల పేరుతో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుందని నాదెండ్ల ఆరోపించారు. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ ను బలవంతంగా రుద్దుతూ, ఆ ముసుగులో వేల కోట్ల రూపాయలను జేబులో వేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
"టోఫెల్ పరీక్ష అనేది డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఒక వేళ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్లాలని భావిస్తే, అమెరికా వెళ్ళేవాళ్లు ముందుగా వారి ఇంగ్లీషు పరిజ్ఞానం తెలుసుకునేందుకు నిర్వహించే టెస్ట్ అని, ఈ పరీక్షను ఈటీఎస్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తారన్నారు.
జగన్ ప్రభుత్వం మాత్రం టోఫెల్ పరీక్షను మూడో తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు ఈ ఏడాది నుంచి 2027 వ సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను అన్ని తరగతుల వారీగా నిర్వహించేలా ఈటీఎస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, దీనికోసం ప్రతి ఏటా రూ.1052 కోట్లు ఖర్చు చేయనున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాలకు కలిపి సుమారుగా రూ.4 వేల కోట్లకు పైబడి ఈ పథకంలో ఖర్చు చేయనున్నారని వివరించారు.
వచ్చే అయిదు నెలల్లో ఇంటికి వెళ్లబోయే ప్రభుత్వం, ఈటీఎస్ సంస్థ వెంటపడి మరి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వైసీపీ పెద్దల స్వలాభం దాగుందని ఆరోపించారు. ఈ ఒప్పందం ఎందుకు చేసుకుందో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఉపయోగం లేని పరీక్ష ఎందుకు?
టోఫెల్ పరీక్షను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత విద్యార్థులు రాస్తారని మూడవ తరగతి పిల్లలకు ఏ మాత్రం పనికిరాదని, అలాగే పదో తరగతి పిల్లలు ఈ పరీక్ష రాసి, ఉత్తీర్ణులు అయినా వారికీ ఉపయోగం లేదన్నారు. డిగ్రీ పూర్తి అయ్యే సమయానికి టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణతకు ఉండే రెండేళ్ల గడువు పూర్తవుతుందని, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పొందే స్కోర్ రెండు సంవత్సరాలు మాత్రమే పరిగణనలో ఉంటుందని అలాంటప్పుడు పదో తరగతి విద్యార్థులకు సైతం ఈ పరీక్ష ఏ మాత్రం ఉపయోగపడదన్నారు.
రాష్ట్రంలోని 1,06,00,316 మంది పిల్లలను కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ప్రయోజనం లేని టోఫెల్ పరీక్షకు రూ.4 వేల కోట్ల ఖర్చు ఎందుకని, అమెరికా దేశం ప్రతి ఏటా తమ దేశంలో చదువుకోవడానికి వచ్చేవారి కోసం నాలుగు లక్షల వీసాలను మాత్రమే ఇస్తోందన్నారు.
దానిలో సుమారు 45 వేల వీసాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయని, అమెరికా చదువుకోవడానికి అంత మందిని అనుమతించినప్పుడు టోఫెల్ పరీక్షలు విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 3.17 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారని, దీనిలో 1.20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారని, వీరంతా ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లరని ఒక వేళ వెళ్ళాలి అనుకున్న వారికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టోఫెల్ పథకం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ఎందుకు ఈ పథకం అంత ఖర్చుపెట్టి అమలు చేస్తున్నారు అన్నది సందేహాస్పదంగా ఉందన్నారు. ఇంగ్లీష్ విద్యలో చిన్నారులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కనిపించడం లేదన్నారు.
ఉన్న టీచర్లు ఎందరు?
రాష్ట్రంలో ఉన్న 1.81 లక్షల ఉపాధ్యాయుల్లో కేవలం 1200 మంది మాత్రమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారని, వారు ఈ పథకంలో పిల్లలకు ఎలా ఉపయోగపడతారని ప్రశ్నించారు. ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులు పరీక్షకు పిల్లలను ఎలా సమాయత్తం చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నారు.
ఎందరో విద్యార్థులకు విదేశీ విద్య కల తీర్చే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కుదించారు. కేవలం ప్రపంచంలో 100 పేరెన్నికగన్న యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు మాత్రమే సహాయం అందిస్తామని చెప్పారని, పథకం పేరును మార్చేసి, గత నాలుగున్నర ఏళ్లలో 357 మంది విద్యార్థులకు, కేవలం రూ.45 కోట్లు సాయం చేసి మమ అనిపించారని పథకం ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పడేసారన్నారు. .
ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న టోఫెల్ పథకంపై సమగ్ర విచారణ జరగాలని, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. విద్యార్థులకు ప్రయోజనం లేని పథకాన్ని తీసుకురావడానికి ప్రణాళిక వేసింది ఎవరు అనే విషయాలు ప్రజలకు తెలియాలన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. .