అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురు మృతి!
02 June 2022, 8:29 IST
- US shooting news | అమెరికాలోని టుల్సాలో కాల్పుల మోత మోగింది. ఓ వైద్య భవనంలో కాల్పులకు తెగబడి.. నలుగురిని చంపేశాడు ఓ ఆగంతకుడు. ఆ ఘటనలో అతను కూడా మరణించాడు.
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
US Shooting news | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓక్లహోమాకు చెందిన టుల్సాలోని ఓ వైద్య భవనంలోకి.. రైఫిల్, హ్యాండ్ గన్‌తో ప్రవేశించిన ఓ ఆగంతకుడు విధ్వంసం సృష్టించాడు. భవనంలోని ప్రజలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు సమాచారం. టెక్సస్ కాల్పుల ఘటన నుంచి అమెరికా ఇంకా కోలుకోకముందే.. మరో విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం జరిగింది ఈ ఘటన. కాగా ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించినట్టు తెలుస్తోంది.
"సెంట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ క్యాంపస్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న మూడు నిమిషాలకే ఘటనాస్థలానికి వెళ్లాము. మొత్తం ఐదు మృతదేహాలు మా వద్ద ఉన్నాయి. వాటిల్లో నిందితుడు మృతదేహం కూడా ఉంది," అని పోలీసులు వెల్లడించారు.
Tulsa shooting | సొంతంగా చేసుకున్న గాయాల కారణంగానే నిందితుడు మరణించినట్టు సమాచారం. నిందితుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అతని వయస్సు 35-40ఏళ్ల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు.
కాగా.. తాజా ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అక్కడి అధికారులు వివరించారు. టుల్సాకు కావాల్సిన సాయం చేసేందుకు బైడెన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
టెక్సాస్ అలజడి..
Texas school shooting | గత వారమే అమెరికాలో భీకర కాల్పుల ఘటన జరిగింది. ఓ 18ఏళ్ల యువకుడు.. గన్ కొనుగోలు చేసి.. తాను చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లాడు. అక్కడ మారణహోమాన్ని సృష్టించాడు. 19మంది చిన్నారులు సహా ఇద్దరు టీచర్లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.