'అమెరికన్లను ఆయుధాల నుంచి దూరం చేయకూడదు.. భద్రత పెంచుకోండి చాలు'
Texas school shooting | అమెరికాలో ఆయుధాలపై కఠిన ఆంక్షలు విధించాలన్న నినాదాలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. సాధారణ ప్రజలను.. ఆయుధాల నుంచి దూరం చేయకూడదని అభిప్రాయపడ్డారు.
Texas school shooting | అమెరికాలోని సాధారణ ప్రజలను ఆయుధాల నుంచి దూరం చేయకూడదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశంలో భద్రతను పెంచుకోవాలని అన్నారు. అంతే కానీ ఆయుధాలపై కఠిన ఆంక్షలు విధించడం సరికాదన్నారు.
టెక్సాస్‌లోని ఓ స్కూల్లో ఓ యువకుడు కాల్పులకు తెగబడి మారణహోమాన్ని సృష్టించిన కొన్ని రోజుల అనంతరం జరిగిన ఎన్ఆర్ఏ(నేషనల్ రైఫిల్ అసోసియేషన్) కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయుధాలపై కఠిన చర్యలు చేపట్టాలని దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదాలను కొట్టిపారేశారు.
Donald Trump | "ప్రపంచంలో ఉన్న చెడును చూసి.. చట్టానికి లోబడి పనిచేసే అమెరికన్లకు ఆయుధాలు ఇవ్వకూడదు అని మనం అనుకోవద్దు. వాస్తవానికి.. ప్రపంచంలో చెడు ఉంది కాబట్టే.. చట్టానికి లోబడి పని చేసే వారికి ఆయుధాల అవసరం ఉంది. ఆయుధాలపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాల్ని ఇవ్వడం లేదు. అందుకే దారుణాలు జరుగుతున్నాయి. ఓ పిచ్చివాడు చేసిన తప్పుతో ఆయుధాలపై కఠిన చర్యలు చేపట్టాలంటే ఎలా? దాని బదులు.. భద్రతను పెంచుకోవాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలి. రిపబ్లికెన్లు, డెమొక్రాట్లు అన్న బేధం లేకుండా.. పాఠశాలల్లో భద్రతను పెంచి, పిల్లలను కాపాడుకోవాలి. స్కూళ్లల్లో భద్రతను పెంచడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని," అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఎన్ఆర్ఏని.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన 'గన్ రైట్స్ ఆర్గనైజేషన్'గా భావిస్తుంటారు.అంతేకాకుండా.. ఆయుధాల విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులు ప్రయత్నించే ప్రతిసారి.. వారికి అడ్డుపడుతూ వస్తోంది ఈ బృందం. గన్లపై కాకుండా.. ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది.
గన్లపై నిషేధాజ్ఞలు వద్దని వాదించే ఈ ఎన్ఆర్ఏ.. తాజాగా జరిగిన కార్యక్రమంలో మాత్రం.. ఎలాంటి ఆయుధాలను తీసుకురావద్దని సూచించడం హాస్యాస్పదం.
స్కూల్లో మారణహోమం..
అమెరికాలో నిత్యం కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకంగా 214 కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. కాగా.. మంగళవారం టెక్సాస్‌లో జరిగిన ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. వీరిలో 19మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగిందని..ఇది అత్యంత దారుణ ఘటన అని అన్నారు.
Texas mass shooting killer | మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలో జరిగిన ఈ ఘటనలో ఒకరే కాల్పులకు తెగబడ్డాడని ఆయన చెప్పారు. వాహనంలో వచ్చిన అతను.. ఒక్కసారిగా కాల్పులు చేశాడని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని కాల్పులు జరపగా.. దుండగుడు మృతి చెందాడని.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు వెల్లడించారు.
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్ స్టేషన్స్ వద్ద జాతీయ జెండాను మే28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు. చిన్నారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
కాల్పుల మోత..
2020లో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19,350 మంది చనిపోయారు. ఇది 2019తో పోలిస్తే 35 శాతం అధికమని సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజాగా పేర్కొంది. అయితే ఈ ఘటనతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పలు సంఘాలు గన్ లైసెన్స్‌ల మంజూరుపై సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్