US: పాఠశాలలో మారణహోమం.. 21 మంది మృతి.. 18 మంది చిన్నారులే..!
Texas shooting: కాల్పులతో అమెరికాలోని టెక్సాస్ నగరం ఉలికిపడింది. ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 18 చిన్నారులు, ముగ్గురు పెద్ద వయసు గల వారు చనిపోయినట్లు తెలుస్తోంది.
Opened fire at an elementary school in Texas: అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మంగళవారం ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. వీరిలో 18 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగిందని..ఇది అత్యంత దారుణ ఘటన అని అన్నారు.
మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలో జరిగిన ఈ ఘటనలో ఒకరే కాల్పులకు తెగబడ్డాడని ఆయన చెప్పారు. వాహనంలో వచ్చిన అతను.. ఒక్కసారిగా కాల్పులు చేశాడని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని కాల్పులు జరపగా.. దుండగుడు మృతి చెందాడని.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో 14 మంది చిన్నారులు.. ఒక టీచర్ చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. స్కూల్ లో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు చెప్పారు.
ఈ ప్రకటన తరువాత ఘటనపై టెక్సాస్ నగర సెనేటర్ రోలాండ్ గోటెరోజ్ స్పందిస్తూ.. దుండగుడి కాల్పుల్లో మొత్తం 21 మంది చనిపోయినట్లు చెప్పారు. ఇందులో 18 మంది చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఇక కాల్పుల ఘటనకు సంబంధించి సీసీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. ఇందులో చనిపోయిన విద్యార్థులు 7 నుంచి 10 ఏళ్ల మధ్య వయసుగల వారు ఉన్నట్లు తెలుస్తోంది.
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్ స్టేషన్స్ వద్ద జాతీయ జెండాను మే28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు. చిన్నారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఇక ఇదే తరహా ఘటన 2012లోనూ జరిగింది. ఈ కాల్పుల్లో 20 మంది విద్యార్థులతో పాటు ఆరుగురు టీచర్లు చనిపోయారు. అయితే గడిచిన కొద్దిరోజుల వ్యవధిలోనే కాల్పులు జరగటం ఇది మూడోసారి కావటం కలకలం రేపుతోంది. మే 15వ తేదీన న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సైనికుడి వేషదారణలో గన్ తో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు... మార్కెట్ లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మృతి చెందిన వారిలో ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఉన్నట్లు గుర్తించారు. గత నెలలో వాషింగ్టన్ లో నూ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
2020లో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19,350 మంది చనిపోయారు. ఇది 2019తో పోలిస్తే 35 శాతం అధికమని సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజాగా పేర్కొంది. అయితే ఈ ఘటనతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పలు సంఘాలు గన్ లైసెన్స్ ల మంజూరుపై సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.