US mass shooting: అమెరికా నైట్ క్లబ్ లో కాల్పులు; ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
14 June 2024, 17:59 IST
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఒహాయో లోని ఒక నైట్ క్లబ్ లో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ చిలికి చిలికి గాలివానై, కాల్పులకు దారి తీసింది. క్లబ్ లో తనతో గొడవ పడిన వారిపై ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా నైట్ క్లబ్ లో కాల్పులు
US mass shooting: అమెరికాలోని ఒహాయో (Ohio)లో ఉన్న ఓ నైట్ క్లబ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కొలంబస్ డౌన్ టౌన్ లోని అవలోన్ డాన్స్ క్లబ్ లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది.
వాగ్వాదం ముదిరి కాల్పులకు దారి తీసింది..
అమెరికాలోని ఒహాయో (Ohio)లో ఉన్న ఓ నైట్ క్లబ్ లో ఇద్దరి మధ్య ప్రారంభమైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానై, కాల్పులకు దారి తీసింది. క్లబ్ లో తనతో గొడవ పడిన వారిపై ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం ఆ వ్యక్తి పారిపోయాడని, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ గ్రెగ్ బోడ్కర్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే చనిపోగా, మరొక వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
ఒహాయో (Ohio)లోని కొలంబస్ డౌన్ టౌన్ లోని అవలోన్ డాన్స్ క్లబ్ నుంచి శుక్రవారం తెల్లవారు జామున 1:45 గంటలకు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులకు ఈ కాల్పుల గురించి సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దుండగుడి కాల్పుల్లో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గ్రాంట్ మెడికల్ సెంటర్ కు తరలించారు. కాల్పుల్లో గాయపడిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరి పరిస్థితిలో స్వల్ప మెరుగుదల కనిపిస్తోంది. బాధితుల వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉంది.
ఇల్లినాయిస్ లో కాల్పులు
నార్త్ ఇల్లినాయిస్ లో జరిగిన మరో కాల్పుల ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా గాయపడ్డాడు. డిక్సన్ సమీపంలోని లాస్ట్ లేక్ ప్రాంతం నుంచి, ప్రమాదంలో ఉన్నామని ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన పోలీసులపై నిందితుడు కాల్పులు జరిపాడు. దాంతో, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఆ దుండగుడు కూడా గాయపడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.