Hyderabad Student Safe : యూఎస్ఏలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని కందుల నితీషా సురక్షితం, పోలీసులు ట్వీట్
Hyderabad Student Safe : గత వారం కాలిఫోర్నియాలో అదృశ్యమైన కందుల నితీషా సురక్షితంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు ట్వీట్ చేశారు.
Hyderabad Student Safe : కాలిఫోర్నియాలో గత వారం కనిపించకుండా పోయిన 23 ఏళ్ల నితీషా కందుల సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు మంగళవారం ధృవీకరించారు. హైదరాబాద్ కు చెందిన నితీషా కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినో (సీఎస్యూఎస్బీ)లో చదువుతున్నారు. మే 28న ఆమె అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. సీఎస్ యూఎస్ బీ చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుటిరెజ్ మంగళవారం సోషల్ మీడియాలో ఆమె అదృశ్యంపై అప్డేట్ ఇచ్చారు.
హైదరాబాద్ విద్యార్థిని సురక్షితం
"లాస్ ఏంజిల్స్ లో మే 28న తప్పిపోయినట్లు వార్తలు వచ్చిన విద్యార్థిని ఆచూకీ లభించింది. ఆమె సురక్షితంగా ఉంది" అని ఎక్స్ లో పోలీసు అధికారులు ట్వీట్ చేశారు. నితీషా కందుల మిస్సింగ్ పై మే 30న లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సౌత్ వెస్ట్ డివిజన్ లో ఫిర్యాదు చేశారు. అదృశ్యానికి ముందు ఆమె చివరిసారిగా మే 28న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో కనిపించారు. కాలిఫోర్నియా లైసెన్స్ పొందిన టయోటా కరోలా కారును కందుల నడుపుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు... ఆమె ఆచూకీపై ఏదైనా సమాచారం తెలిసిన వారు ముందుకు రావాలని ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. అనంతరం ఆమె సమాచారం దొరికినట్లు, సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు మరో ట్వీట్ చేశారు. అయితే ఆమె అదృశ్యానికి ఇంకా కారణాలు వెల్లడించలేదు.
పలు అదృశ్యాలు విషాదాంతం
ఏప్రిల్ లో హైదరాబాద్ కు చెందిన మరో భారతీయ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ (25) క్లీవ్ ల్యాండ్ లో శవమై కనిపించారు. క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీలో చేరిన ఆయన మార్చి నుంచి కనిపించకుండా పోయారు. 26 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకిండి మే 2 నుంచి చికాగోలో కనిపించకుండా పోయాడు. నితీషా కందుల అదృష్టవశాత్తూ వారం రోజుల్లో దొరికిందని, అందరికీ ఇలా అదృష్టం కలిసిరాదని పోలీసులు తెలిపారు.