Jaya Badiga: కాలిఫోర్నియా శాక్రిమెంటో సుపిరీయర్ జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ నియామకం..
Jaya Badiga: అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయురాలికి జడ్జి పదవి దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన బాడిగ జయను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Jaya Badiga: అమెరికా కోర్టులో జడ్జిగా భారతీయ మహిళను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాడిగను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా బాడిగ జయ గుర్తింపు పొందారు. కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె అయిన జయ ఉస్మానియా యూనివర్శిటీలో బిఏ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
2022 నుంచి కోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న బాడిగ జయ కాలిఫోర్నియాలో ఫ్యామిలీ లా నిపుణురాలిగా గుర్తింపు పొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగానూ వ్యవహరించారు.
ఏపీలోని విజయవాడలో పుట్టిన బాడిగ జయ హైదరాబాదులో చదువుకున్నారు. 1991-1994 నడుమ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్సు సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలో కూడా జయ పనిచేశారు.
పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె అయిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులు కావడంతో స్వస్థలంలో బంధు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జడ్జి పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు. 2022 నుంచి శాక్రిమెంటో సుపీరియర్ కోర్టులో జయ కమిషనర్‌గా ఉన్నారు.
జయ తండ్రి బాడిగ రామకృష్ణ 2004-09 వరకు కృష్ణాజిల్లా మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పని చేశారు. బాడిగ రామకృష్ణ దంపతులకు ముగ్గురు కుమార్తెలతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. వారిలో జయ మూడో కుమార్తె... బాడిగ జయ ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగినట్టు తెలుస్తోంది. .
ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తిచేసిన తర్వాత అమెరికా వెళ్లిన ఆమె, బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టాను పొందారు.
2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్‌లో అర్హత సాధించారు. అమెరికాలో 10 ఏళ్లకుపైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు. యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రయిల్ అడ్వకసీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా వ్యవహరించారు. మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగా పనిచేశారు. జయతోపాటు మరో భారత సంతతికి చెందిన న్యాయమూర్తి రాజ్ సింగ్ బధేషా సహా 18 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ గవర్నర్ న్యూసోమ్ సోమవారం ప్రకటించారు.