Ukraine | 10రోజుల వ్యవధిలో.. ఇద్దరు బిడ్డలకు ఖననం చేసిన తల్లి
18 April 2022, 21:33 IST
- ఉక్రెయిన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో హృదయ విదారక వార్తలు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. తాజాగా.. ఓ తల్లి.. 10 రోజుల వ్యవధిలో తన ఇద్దరు కుమారులకు ఖననం చేసింది. ఈ వార్త అందరికి కంటతడి పెట్టిస్తోంది.
బిడ్డలకు ఖననం చేసిన తల్లి
Russia Ukraine war | యుద్ధ విచ్ఛిన్న దేశం ఉక్రెయిన్ నుంచి ఎన్నో హృదయ విదారక కథలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి.. 10రోజుల వ్యవధిలో తన ఇద్దరు బిడ్డలను ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వీర సైనికులకు వందనం..
ఆ తల్లి పేరు అహాఫియా వ్యశ్య్వన. ఆమెకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ ఉక్రెయిన్ సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సైనికులకు పని ఎక్కువైంది. రష్యా దాడిలో చాలామంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. వారిలో వ్యశ్య్వన కుమారులు వాసిల్, కైరిలో కూడా ఉన్నారు.
రష్యా దాడిలో గత నెల 3న.. వాసిల్(28) ప్రాణాలు కోల్పోయాడు. కాగా అదే నెల 13న అతని సోదరుడు, వ్యశ్య్వన పెద్ద కుమారుడు కైరిలో(35).. రష్యా మిసైల్‌కు బలయ్యాడు. వీరి అంత్యక్రియలు డులుబై అనే గ్రామంలో జరిగింది. 10రోజుల వ్యవధిలో మరణించిన సోదరులకు.. ఖననం చేసింది ఆ తల్లి. వీరి అంత్యక్రియలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‌కు అనుకూలంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. వారి నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. ఈ దృశ్యాలను స్థానిక జర్నలిస్ట్ చిత్రీకరించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. తన జీవితంలోనే హృదయవిదారక ఘటన అంటూ రాసుకొచ్చాడు.
ఇంత కష్టమొచ్చినా.. ఆ తల్లి బాధపడలేదు. సైనికుల తల్లిలాగే ప్రవర్తించింది. తన కుమారులు.. దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడింది.
ఉక్రెయిన్ సైనికుల ధైర్యసాహసాల గురించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. రష్యాను ఎదురించి నిలుస్తున్న వారికి ప్రపంచ దేశాల ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు శక్తి లభించాలని ప్రార్థనలు చేస్తున్నారు.
టాపిక్