Russia Ukraine war| శాంతి చర్చలు సక్సెస్.. యుద్ధానికి ముగింపు పడినట్టేనా?
ఎట్టకేలకు రష్యా శాంతించింది! ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. మంగళవారం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి.
Russia Ukraine talks | రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు బీజం పడినట్టు కనిపిస్తోంది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా ఉక్రెయిన్ చర్చలు ఫలప్రదమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల నుంచి సైనిక కార్యకలాపాలను వెనక్కి తీసుకునేందుకు రష్యా అంగీకరించింది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ రక్షణమంత్రి అలెగ్జాండర్ ఫామిన్ వెల్లడించారు.
మంగళవారం జరిగిన రష్యా ఉక్రెయిన్ చర్చలు అర్థవంతంగా సాగినట్టు మధ్యవర్తి వ్లాదిమిర్ మెడిన్స్కీ వెల్లడించారు. అన్ని సవ్యంగా సాగితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిసే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. అందువల్ల శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు త్వరితగతిన చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ అధికారులు సైతం పుతిన్- జెలెన్స్కీ భేటీపై ఆశాభావం వ్యక్తం చేశారు. 'అధ్యక్షుల స్థాయి సమావేశం జరగడానికి.. ఈరోజు భేటీతో వచ్చిన ఫలితాలు చాలు,' అని ఉక్రెయిన్ అధికారి డేవిడ్ అరాఖామియ వెల్లడించారు.
యుద్ధ విచ్ఛిన ఉక్రెయిన్లో మానవతా సంక్షోభంపై ఈ భేటీలో అధికంగా చర్చించినట్టు సమాచారం. ఎవరిపైనా ఆధారపడకుండా.. ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా డిమాండ్ సైతం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తమ దేశానికి భద్రత కల్పించే విధంగా అంతర్జాతీయ స్థాయి ఒప్పందం జరగాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అణ్వాయుధాలపై స్పష్టత..
ఉక్రెయిన్ మీద అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. ఉక్రెయిన్పై అణ్వాయుధాలు ప్రయోగించాలని తాము అనుకోవడం లేదని పేర్కొంది. కాగా.. తమ దేశానికి ముప్పు వాటిల్లితే మాత్రం అణ్వాయుధాల గురించి ఆలోచించాల్సి వస్తుందని తెలిపింది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ అణ్వాస్త్రాల గురించి పుతిన్ పలుమార్లు మాట్లాడారు. ఓ సందర్భంలో.. ఏకంగా ఆయుధాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. అందువల్ల.. ఉక్రెయిన్పై పుతిన్ ఆణ్వస్త్రాలను ప్రయోగిస్తారా? అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా.. అలాంటి ఉద్దేశం లేదని రష్యా చెప్పడంతో ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్