`మోస్క్‌వా` ధ్వంసం ఉక్రెయిన్ విజయమా? `బ్లాక్ సీ`లో రష్యా పరిస్థితి ఏంటి?
మోస్క్‌వా.. రష్యా యుద్ధ నౌక. రష్యా యుద్ధ పాటవ గౌరవ ప్రతీక. రష్యా బ్లాక్ సీ పటాలానికి కమాండ్ సెంటర్ ఈ ఫ్లాగ్`షిప్`. ఇలాంటి ప్రతిష్టాత్మక నౌక ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమవడం రష్యా ప్రతిష్టకే భంగకరం. దాంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ముప్పేట దాడులతో విరుచుకుపడుతోంది. ఈ ఘటన మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే వాదన కూడా ఉంది.
ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యాకు అత్యంత కీలకమైన బ్లాక్ సీ ఫ్లీట్ లోని కమాండ్ సెంటర్, ప్రధాన వార్ షిప్ `మోస్క్‌వా` ధ్వంసమై నీట మునిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఈ ఘటనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఘటనతో.. ఇప్పటివరకు దాదాపు వన్‌సైడ్‌గా కొనసాగుతున్న వార్‌లో తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన, డైనమిక్ స్ట్రెటజీలను అమలు చేయాల్సిన పరిస్థితి రష్యాకు ఏర్పడింది. అలాగే, రక్షణాత్మక చర్యలను కొనసాగిస్తూనే ఎదురు దాడులకు పదును పెట్టే దిశగా ఉక్రెయిన్ వ్యూహం మారింది.
బ్లాక్ సీ నౌకాదళానికి గుండెకాయ.. మోస్క్‌వా
మోస్క్‌వా సాధారణ యుద్ధ నౌక కాదు. మొత్తం రష్యా బ్లాక్ సీ పటాలానికి గుండెకాయ వంటింది. దీనిపై అత్యంత ఆధునిక మూడంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఇందులో 64 ఎస్ -300 ఎఫ్ క్షిపణులు, 40 మీడియం రేంజ్ ఓఎస్ఏ-ఏఎమ్ క్షిపణులు, 6 ఏకే-630 ఆయుధ వ్యవస్థలు సదా సిద్ధంగా ఉంటాయి. ఈ నౌకక దాదాపు 100 కిమీల పరిధిలో ఎయిర్ డిఫెన్స్ విధులను నిర్వర్తిస్తుంటుంది. ఈ నౌక మునిగిపోవడం రష్యా రక్షణ వ్యవస్థకు.. ముఖ్యంగా బ్లాక్ సీ డిఫెన్స్ సిస్టమ్‌కు పెద్ద దెబ్బ. ఈ షిప్ అందించే రక్షణ కరువవడంతో బ్లాక్ సీలో ఉక్రెయిన్ తీరానికి దగ్గరలో విధుల్లో ఉన్న ఇతర నౌకలు ప్రమాదంలో పడ్డాయి. ఉక్రెయిన్ దాడులకు అవి అందుబాటులో ఉండే పరిస్థితి నెలకొంది. క్రిమియా, ఒడెస్సా(ఉక్రెయిన్)ల మధ్య `మోస్క్‌వా` రెగ్యులర్‌గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇతర రష్యా సైనిక పటాలాలకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఒడెస్సాపై దాడికి ఒక పెద్ద నౌకాపటాలం బ్లాక్ సీలో సిద్ధంగా ఉంది. దానికి ఎయిర్ డిఫెన్స్ కవర్ అందించాల్సిన బాధ్యత మోస్క్‌వాపై ఉంది. కానీ మోస్క్‌వా నీట మునగడంతో ఆ పటాలంపై ఉక్రెయిన్ దాడులు చేయడానికి పరిస్థితి అనుకూలంగా మారింది.
`మోస్క్‌వా`పై దాడి ఎలా జరిగింది?
బ్లాక్ సీలో `మోస్క్‌వా` చాన్నాళ్లుగా ఉండడంతో.. దాని పెట్రోలింగ్ మార్గాన్ని అంచనా వేయడం ఉక్రెయిన్‌కు సులభమైంది. క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున డ్రోన్లను పంపిస్తూ.. ఉక్రెయిన్ ఆర్మీ మొదట మోస్క్‌వా`పై ఉన్న మూడెంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పక్కదారి పట్టించింది. ఆ తరువాత నౌక విధ్వంసక పీ - 360 నెప్ట్యూన్ క్షపణులతో మోస్క్‌వాపై విరుచుకుపడింది. క్షిపణి దాడితో ధ్వంసమై మంటలంటుకున్న నౌకను సెవాస్టపోల్ తీరానికి తీసుకువెళ్లాలన్న రష్యా ప్రయత్నం విఫలమైంది. చివరకు అగ్ని కీలలకు ఆహుతై నీట మునిగింది. మొదట ఉక్రెయిన్ దాడిలో ఈ నౌక ధ్వంసమైనదన్న వార్తను రష్యా ఒప్పుకోలేదు. ప్రమాదవశాత్తూ నీట మునిగిందని వాదించింది. అంతకుముందు, మార్చ్ 24న కూడా రష్యాకు చెందిన మరో యుద్ధ నౌక `ఓర్స్క్`పై దాడి చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక యుద్ధంలో ఒక భారీ యుద్ధ నౌక ధ్వంసమవడం ఇదే తొలిసారి.
`బ్లాక్ సీ`పై ప్రాబల్యం కీలకం
రష్యాకు వ్యూహాత్మకంగా బ్లాక్ సీ ఎంతో కీలకం. బ్లాక్ సీపై ప్రాబల్యం కోసం అమెరికా, యూరోప్ దేశాలు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గత సంవత్సర కాలంలోనే అమెరికా చాలా సార్లు ఈ ప్రయత్నం చేసింది. 2021 జనవరి - మార్చ్ మధ్య బ్లాక్ సీలో అమెరికా నౌకాదళం మోహరించింది. ఇది అంతర్జాతీయ నిబంధనలకు, మోంట్రెక్స్ కన్వెన్షన్‌కు వ్యతిరేకం. అదే సమయంలో నాటోలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ డిమాండ్ చేయడం గమనార్హం. ఏప్రిల్ 2021 నుంచి అమెరికా నౌకలు, బ్రిటన్ నౌకాదళం బ్లాక్ సీలో అన్ని ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించి పెట్రోలింగ్ చేశాయి. ఒక దశలో తమ నౌకాకేంద్రాలకు దగ్గరగా వచ్చిన బ్రిటన్ యుద్ధ నౌక `హెచ్ఎంఎస్ డిఫెండర్`ను వెనక్కు పంపేందుకు రష్యా కాల్పులు జరపాల్సి వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల విశ్లేషణలో ఈ ఘటనలు అత్యంత ముఖ్యమైనవి.
నిజానికి రష్యా సైనిక పాటవం, నౌకాదళ సామర్ధ్యంతో ఉక్రెయిన్ సామర్ధ్యాన్ని పోల్చడం సరికాదు. అయినా, దాదాపు రెండు నెలలుగా రష్యాను ఉక్రెయిన్ నిలువరించగలుగుతోంది. నాటో దేశాల `ముందస్తు` సహకారంతోనే ఇది సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరికొత్త వ్యూహాలు
మోస్క్‌వా ధ్వంసమవడంతో, బ్లాక్ సీలో రష్య నౌకా పటాలానికి ప్రస్తుతం రక్షణ కరువైంది. డార్డనెల్స్ స్ట్రెయిట్`ను టర్కీ మూసేయడంతో మోస్క్‌వాకు ప్రత్యామ్నాయంగా మరో యుద్ధ నౌకను ఇప్పటికిప్పుడు పంపలేని పరిస్థితిలో రష్యా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ భూభాగంపై దాడులను తీవ్రం చేయడమే రష్యా ముందున్న ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే గత రెండు రోజులుగా కీవ్, మరియపోల్ తదితర నగరాలపై దాడులను తీవ్రం చేసింది. కీవ్‌కు సమీపంలోని క్షిపణి ఉత్పత్తి కార్మాగారాన్ని ధ్వంసం చేసింది.
సంబంధిత కథనం
టాపిక్