Sanjay Raut : ‘తగ్గేదే లే..’ డైలాగ్‌తో సంజయ్ రౌత్‌కు ఉద్ధవ్ ఠాక్రే మద్దతు
01 August 2022, 16:13 IST
Sanjay Raut : అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మద్దతు ప్రకటించారు ఉద్దవ్ ఠాక్రే. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌ను ప్రస్తావించారు.
సంజయ్ రౌత్ నివాసం వద్ద ఉద్దవ్ ఠాక్రే
Sanjay Raut : శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సంజయ్ రౌత్.. నిజమైన శివసైనికుడు అని కొనియాడారు.
భూకుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. సోమవారం మధ్యాహ్నం ఆయన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ పరిణామాల మధ్య ముంబైలోని సంజయ్ రౌత్ నివాసానికి వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తన మద్దతును ప్రకటించారు.
అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమాలోని డైలాగ్‌ను ప్రస్తావించారు ఉద్ధవ్ ఠాక్రే.
"సంజయ్ రౌత్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పుష్ప సినిమాలో 'జుకేంగా నహీ' (తెలుగులో.. తగ్గేదే లే) అని ఓ డైలాగ్ ఉంది. సంజయ్ రౌత్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆయనే నిజమైన శివసైనికుడు. ఒత్తిడికి తలొగ్గము అని చెప్పిన వారందరు ఇప్పుడు అటు(బీజేపీ)వైపు ఉన్నారు. బాలాసాహెబ్ చెప్పిన మార్గం అది కాదు. రౌతే నిజమైన శివ సైనికుడు," అని ప్రశంసించారు ఉద్ధవ్ ఠాక్రే.
ఈ క్రమంలోనే బీజేపీపై విరుచుకుపడ్డారు శివసేన అధ్యక్షుడు. విద్వేష రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు.
నాలుగు రోజుల కస్టడీ..
Uddhav Thackery : మరోవైపు.. సంజయ్ రౌత్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు.. 8 రోజుల కస్టడీని కోరారు. కాగా.. వారికి 4 రోజుల కస్టడీని కోర్టు మంజూరు చేసింది.
సంజయ్ రౌత్ అరెస్ట్ నేపథ్యంలో.. కోర్టు, ఈడీ కార్యాలయం వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సంజయ్ రౌత్ మద్దతుదారులు, శివసేన కార్యకర్తలు.. ఈడీ కార్యాలయం, కోర్టుకు భారీగా తరలివెళ్లి నిరసన తెలిపారు.
అంతకుముందు.. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ముంబైలోని సంజయ్ రౌత్ నివాసానికి వెళ్లిన అధికారులు.. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. సంజయ్ రౌత్ నివాసంలో నుంచి లెక్కల్లో చూపించని రూ. 11.15లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. కాగా.. సోమవారం తెల్లవారుజామున సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో.. సంజయ్ రౌత్‌ను ఈడీ కార్యాలయం నుంచి జేజే హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు.. సంజయ్ రౌత్ అత్యంత సన్నిహితుడు. ఇటీవలే ఆ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు.. ఠాక్రేకు సంజయ్ రౌత్ అండగా నిలిచారు. ఇప్పుడు ఆయన అరెస్టుతో శివసేనకు షాక్ తగిలినట్టు అయ్యింది.