Sanjay Raut : ఈడీ అధికారుల అదుపులో సంజయ్ రౌత్
Sanjay Raut : శివసేన ఎంపి సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భూకుంభకోణం కేసులో భాగంగా.. అనేక గంటల పాటు విచారించిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
Sanjay Raut : శివసేన ఎంపీ, ప్రముఖ రాజకీయ నేత సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పత్రాచల్ భూకుంభకోణం కేసు విచారణలో భాగంగా.. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఈ చర్యలు చేపట్టారు.
కొంతకాలం క్రితం.. విచారణకు హాజరుకావాలని సంజయ్ రౌత్‌కు రెండుసార్లు నోటీసులు జారీచేసింది ఈడీ. వివిధ కారణాలు చెప్పి.. ఆయన ఈడీ వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఈడీ.. ఆదివారం ఉదయం 7గంటలకు.. ముంబైలోని సంజయ్ రౌత్ నివాసం తలుపు తట్టింది. ఈడీ వెంట సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా వెళ్లారు.
భూకుంభకోణం కేసులో భాగంగా.. అనేక గంటలు పాటు సంజయ్ రౌత్ నివాసంలో సోదాలు నిర్వహించింది ఈడీ. వివిధ అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు.
"తప్పుడు ఆరోపణలు, తప్పుడు చర్యలు. నేను శివసేనను విడిచిపెట్టాను. మరణించినా సరే.. నేను లొంగను. స్కామ్‌తో నాకు సంబంధం లేదు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మీద ఒట్టేసి చెబుతున్నా.. నాకు సంబంధం లేదు. పోరాడాలని బాలాసాహెబ్ మాకు చెప్పారు. శివసేన కోసం పోరాడుతూనే ఉంటాను," అని.. ఈడీ సోదాల మధ్యలోనే సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
ఇటీవలే పదవి కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు.. సంజయ్ రౌత్ అత్యంత సన్నిహితుడు. తాజా పరిణామాలతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.
రూ. 11.5లక్షలు జప్తు..
సంజయ్ రౌత్ నివాసం నుంచి ఈడీ అధికారులు.. రూ. 11.5లక్షలను జప్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు.. తర్వాత సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.
సంబంధిత కథనం