Mumbai: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు షాక్.. ఇంట్లో ఈడీ సోదాలు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు చేపట్టింది .
ed officials search sanjay raut residence: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయమే ఇంటికి చేరుకున్న అధికారులు... ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్నారు.
పత్రాచాల్ భూకుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగా ఈడీ ఈ తనిఖీలను చేపట్టింది. అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూలై 27న విచారణకు రావాలని రౌత్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ విచారణకు రౌత్ రాలేదు. దీంతో ఈడీ అధికారులు ఇవాళ రైడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సంజయ్ రౌత్ కు సుదీర్ఘ సమయం పాటు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రౌత్ మద్దతుదారులు.... ఇంటికి చేరుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో రౌత్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి.
సంజయ్ రౌత్ ట్వీట్...
ఈడీ దాడులపై రౌత్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదని చెప్పారు.ఎలా పోరాడాలో బాలాసాహెబ్ మాకు నేర్పించారని రాసుకొచ్చారు.
టాపిక్