Sanjay Raut : కోర్టుకు సంజయ్ రౌత్.. శివసేన నిరసనలు
Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు.. ఆయన్ని అరెస్ట్ చేశారు.
Sanjay Raut : శివసేన ఎంపీ, ప్రముఖ రాజకీయ నేత సంజయ్ రౌత్‌ను ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో సోమవారం ఉదయం హాజరుపరిచారు ఈడీ అధికారులు. పత్రాచల్ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును ఈడీ అధికారులు అభ్యర్థించనున్నారు.
సంజయ్ రౌత్ అరెస్ట్ నేపథ్యంలో.. కోర్టు, ఈడీ కార్యాలయం వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సంజయ్ రౌత్ మద్దతుదారులు, శివసేన కార్యకర్తలు.. ఈడీ కార్యాలయం, కోర్టుకు భారీగా తరలివెళ్లి నిరసన తెలిపారు.
అంతకుముందు.. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ముంబైలోని సంజయ్ రౌత్ నివాసానికి వెళ్లిన అధికారులు.. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. సంజయ్ రౌత్ నివాసంలో నుంచి లెక్కల్లో చూపించని రూ. 11.15లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. కాగా.. సోమవారం తెల్లవారుజామున సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో.. సంజయ్ రౌత్‌ను ఈడీ కార్యాలయం నుంచి జేజే హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు.
Sanjay Raut ED : మురికివాడను పునర్నిర్మించే ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపణులు ఉన్నాయి. ఈ క్రమంలో.. సంజయ్ రౌత్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్ రౌత్ చెబుతున్నారు. శివసేన నుంచి తనను వేరు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరణానికైనా సిద్ధమని, కానీ శివసేన నుంచి బయటకు రానని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
సంజయ్ రౌత్ నివాసానికి ఉద్ధవ్ ఠాక్రే..
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ముంబైలోని సంజయ్ రౌత్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులకు మద్దతు ప్రకటించారు. సంజయ్ రౌత్‌కు అండగా ఉంటానని హామీనిచ్చారు.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు సంజయ్ రౌత్ అత్యంత సన్నిహితుడు అని గుర్తింపు ఉంది.
సంబంధిత కథనం