తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Turkey Earthquake : టర్కీలో మరో రెండు భూకంపాలు: 47వేలు దాటిన మృతుల సంఖ్య

Turkey Earthquake : టర్కీలో మరో రెండు భూకంపాలు: 47వేలు దాటిన మృతుల సంఖ్య

21 February 2023, 6:30 IST

google News
    • Turkey Earthquake: టర్కీలో మరో రెండు భూకంపాలు సంభవించాయి. రెండు వారాల క్రితం సంభవించిన భీకర భూకంపం వల్ల అపార నష్టానికి గురైన టర్కీ, సిరియా తాజా భూకంపాలతో ఉలిక్కిపడ్డాయి.
Turkey Earthquake : టర్కీలో మరో రెండు భూకంపాలు
Turkey Earthquake : టర్కీలో మరో రెండు భూకంపాలు (AFP)

Turkey Earthquake : టర్కీలో మరో రెండు భూకంపాలు

Turkey Earthquake: రెండు వారాల క్రితం భీకర భూకంపంతో అతలాకుతలం అయిన టర్కీలో తాజాగా మరో రెండు భూకంపాలు సంభవించాయి. టర్కీ, సిరియా సరిహద్దులో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ భూకంపాలు వచ్చాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి బిక్కుబిక్కుమంటున్న ప్రజలను ఇవి మరింత భయాందోళనకు గురి చేశాయి. 7.8 తీవ్రతతో ఈనెల 6వ తేదీన సంభవించిన భూకంపం ధాటికి టర్కీ, సిరియాలో వేలాది ఇళ్లు కూలిపోయాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 47,000 దాటిపోయింది. ఈ తరుణంలో సోమవారం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాసేపటికే 5.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. వీటి వల్ల కూడా కొన్ని భవనాలు శిథిలమైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇవే..

Turkey Earthquake: టర్కీలోని ఆంటియోచ్‍ (Antioch) సమీపంలో సోమవారం ముందుగా 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత దక్షిణ సమందాగ్ (Samandag) సిటీలో 5.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపాలు సిరియా, ఈజిప్ట్, లెబనాన్‍లపై కూడా ప్రభావం చూపాయి.. తాజా భూకంపాల వల్ల టర్కీలోని కొన్ని భవనాలు శిథిలమైనట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. తాజా భూకంపాల వల్ల 8 మంది మృతి చెందగా.. 200 మంది వరకు గాయపడ్డారని టర్కీ మంత్రి సులేమాన్ సొయ్లు (Suleyman Soylu) వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నామన్నారు.

టర్కీలో 42వేలకు పైగా మృతులు

Turkey Earthquake: ఈనెల 6వ తేదీన టర్కీ కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భీకర భూకంపంతో టర్కీ, సిరియాలో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. టర్కీలో మృతుల సంఖ్య 42వేలు దాటింది. సిరియాలో సుమారు 5వేల మంది వరకు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు వారాలైన ఇంకా కొందరు శిథిలాల కింద ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

16లక్షల మంది పునరావాస కేంద్రాల్లో..

Turkey Earthquake: టర్కీలో సుమారు 16లక్షల మంది ప్రజలు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారి ఇళ్లు భూకంపాల ధాటికి కుప్పకూలటంతో పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు. దేశంలో సుమారు 2లక్షల ఇళ్లను నిర్మించేందుకు టర్కీ ప్రభుత్వం ప్రణాళిక రచించుకుంది.

తదుపరి వ్యాసం