Turkey, Syria Earthquakes: భీకర భూకంపాలు: 2600 దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద ఇంకా వేల మంది!-turkey syria earthquake death toll cross 600 in powerful earthquake ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Turkey Syria Earthquake Death Toll Cross 600 In Powerful Earthquake

Turkey, Syria Earthquakes: భీకర భూకంపాలు: 2600 దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద ఇంకా వేల మంది!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 06, 2023 07:15 PM IST

Turkey, Syria Earthquake: టర్కీ, సిరియాలో భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తీవ్రమైన భూకంప ఘటనలో మృతుల సంఖ్య 2600 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉన్నారు.

Turkey, Syria Earthquakes: టర్కీ, సిరియాలో భీకర భూకంపం
Turkey, Syria Earthquakes: టర్కీ, సిరియాలో భీకర భూకంపం (AFP)

Turkey, Syria Earthquake: టర్కీ, సిరియా దేశాలకు భీకర భూకంపాలు అపార నష్టాన్ని కలిగించాయి. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నేడు (ఫిబ్రవరి 6, సోమవారం) తెల్లవారుజామున టర్కీలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చింది. ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. భూకంప తీవ్రతతో టర్కీ, సిరియాలో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2600 దాటింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఇంకా వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. సహాయక చర్యలకు తీవ్రమైన మంచు ఇబ్బంది కలిగిస్తోంది. కాగా, సోమవారం సాయంత్రం టర్కీలో మరో రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత 7.5, 6గా నమోదైంది. దీంతో 24 గంటల వ్యవధిలో మూడు భూకంపాలను టర్కీ ఎదుర్కొంది. పక్కనే ఉన్న సిరియాలోని చాలా నగరాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాల్లో వేలాది ఇళ్లు కుప్పకూలిపోయాయి. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

40సార్లు ప్రకంపనలు

Turkey, Syria Earthquake: నైరుతి టర్కీలోని గజియాన్‍టెప్ (Gaziantep) వద్ద భూకంప కేంద్రం ఉందని, 17.9 కిలోమీటర్ల లోతులో 7.8 తీవ్రతతో భూకంపం ఏర్పడిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మొదటి భూకంపం 7.4 తీవ్రతగా నమోదైందని టర్కీ ఏఎఫ్ఏడీ ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్ వెల్లడించింది. ఆ తర్వాత ఏకంగా 40సార్లకు పైగా భూమి స్వల్పంగా కంపించిందని పేర్కొంది. గజియాన్‍టెప్ సిటీ.. సిరియా సరిహద్దుకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో ఇరు దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా గజియాన్‍టెప్ తీవ్రంగా నష్టపోయింది.

టర్కీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఊహించని ఘోరం జరిగింది.

ఈ నగరాలపై..

Turkey, Syria Earthquake: టర్కీలోని గజియాన్‍టెప్, కహ్రామనమ్మరాస్ సహా అనేక నగరాలు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. సిరియాలోని అలెప్పో, లటాకియా, హమ, టార్టస్ సిటీల్లో తీవ్ర ప్రభావం పడింది. ఈ సిటీల్లో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి.

టర్కీలో మృతులు ఎక్కువ..

భూకంపం వల్ల టర్కీలో ఇప్పటి వరకు తమ దేశంలో 1,651 మందికిపైగా మృతి చెందారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. సిరియాలో 968 మందికి పైగా ప్రజలు చనిపోయారని అక్కడి అధికార వర్గాలు ప్రకటించాయి. ఇంకా రెండు దేశాల్లో భవనాల శిథిలాల కింద వేలాది మంది ప్రజలు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Turkey, Syria Earthquake: ఇరు దేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల తొలగింపును వేగవంతం చేస్తున్నారు అక్కడి సిబ్బంది. అయితే రోడ్లపై మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా వేలాది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలిస్తూనే ఉన్నారు.

అత్యంత భయానకం

Turkey, Syria Earthquake: తన జీవితంలో ఎప్పుడూ ఇంత భయానక పరిస్థితి ఎదుర్కొనలేదని భూకంపంలో గాయపడిన ఓ మహిళ చెప్పారు. “మేము ఊయలలో ఉన్నట్టు ఊగిపోయాం. మేం ఇంట్లో తొమ్మిది మంది ఉన్నాం. నా ఇద్దరు కుమారులు ఇప్పటికీ శిథిలాల కిందే ఉన్నారు. వారి కోసం ఎదురుచూస్తున్నా” అని ఆమె చెప్పారు. వారు నివసిస్తున్న ఏడు అంతస్థుల భవనం భూకంపం వల్ల కుప్పకూలిపోయింది. ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలా టర్కీ, సిరియాలో లక్షలాది మందికి భూకంపం విషాదాన్ని మిగిల్చింది.

IPL_Entry_Point