Turkey earthquake : టర్కీలో భారీ భూకంపం.. ఐదుగురు మృతి
Turkey earthquake today : 7.8 తీవ్రతతో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భూకంపం ధాటికి అనేక నగరాల్లోని భవనాలు నేలకూలాయి.
Turkey earthquake today : టర్కీలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. నైరుతి టర్కీలో రిక్టార్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ఘటనలో అనేక నగరాల్లోని భవనాలు నేలకూలాయి. పలు ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. సరిహద్దులోని సిరియా దేశంపైనా భూకంపం ప్రభావం పడినట్టు తెలుస్తోంది.
గాజియాంటెప్, ఖహ్రమన్మరస్ నగరాల కేంద్రంగా.. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4:17 గంటలకు భూమి కంపించింది. భూమికి 17.9 కి.మీల లోతులో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా.. టర్కీ ఎమర్జెన్సీ సర్వీస్ విభాగం మాత్రం.. 7.4తీవ్రతతో భూమి కంపించినట్టు ప్రకటన విడుదల చేసింది. మొదటి భూకంపం సంభవించిన 15 నిమిషాల వ్యవధిలోనే మరోమారు భూమి కంపించింది! రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 6.7గా నమోదైంది.
Earthquake in Turkey : టర్కీ భూకంపం ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో.. మృతుల సంఖ్య ఆందోళనకరంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా.. అక్కడి దృశ్యాలు మాత్రం భయానకంగా ఉన్నాయి. అనేక ఇళ్లు నేలకూలాయి. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
గాజియాంటెప్, ఖహ్రమన్మరస్తో పాటు పరిసర నగరాలైన ఆదియమన్, మలాత్యలోనూ భూమి కంపించింది. ఇక టర్కీ భూకంపం ఎఫెక్ట్ లెబనాన్, సిరియా, సిప్రస్ వంటి దేశాలపైనా పడింది. సిరియాలోని పశ్చిమ తీర ప్రాంతమైన లటకియాలో పలు భవనాలు కూలిపోయాయి!
భూకంపాల టర్కీ..!
Turkey earthquake 2023 :భూకంపాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో టర్కీ ఒకటి. 1999లో ఇక్కడ 7.4 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనలో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000మందికిపైగా ప్రజలు మృతిచెందారు.
నిబంధనలను ఉల్లంఘించి, పర్యావరణాన్ని లెక్కచేయకుండా వేలాది ఇళ్లు కట్టడంతో ఇస్తాంబుల్‌లో భారీ భూకంపాలు వస్తాయని నిపుణులు అనేకమార్లు హెచ్చరించారు.
2020లో ఎలజిగ్ ప్రాంతంలో వచ్చిన భూకంపానికి 40మంది మరణించారు. నాడు రిక్టార్ స్కేల్‌పై 6.8తీవ్రతతో భూకంపం సంభవించింది.
Earthquake in Turkey news : ఇక గతేడాది అక్టోబర్‌లో 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 114మంది మరణించారు. 1000మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
సంబంధిత కథనం