Iran Earthquake : ఇరాన్​లో భూకంపం.. ఏడుగురు మృతి!-strong earthquake in northwest iran kills at least seven people several injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iran Earthquake : ఇరాన్​లో భూకంపం.. ఏడుగురు మృతి!

Iran Earthquake : ఇరాన్​లో భూకంపం.. ఏడుగురు మృతి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 29, 2023 08:12 AM IST

Iran Earthquake today : ఇరాన్​లో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 400కుపైగా మంది ప్రజలు గాయపడ్డారు.

ఇరాన్​లో భూకంపం.. అనేక మంది మృతి!
ఇరాన్​లో భూకంపం.. అనేక మంది మృతి! (HT_PRINT)

Iran Earthquake today : ఇరాన్​లో భారీ భూకంపం సంభవించింది! టర్కీకి సరిహద్దులోని వాయువ్య ఇరాన్​ ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 400కుపైగా మంది ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. రిక్టార్​ స్కేలుపై ఇరాన్​ భూకంపం తీవ్రత 5.9గా నమోదైంది. ఖోయ్​ నగరం కేంద్రబిందువుగా ఈ భూకంపం సంభవించింది.

Earthquake in Iran : భూప్రకంపనలు నమోదైన కొన్ని ప్రాంతాల్లో.. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు మంచు కూడా తీవ్రంగా కురుస్తోంది. ఫలితంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో విద్యుత్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇరాన్​లో భూకంపాల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా.. భూకంపాలు ఇక్కడి ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే.. జనవరి 18న సంభవించిన భూకంపం ధాటికి ఖోయ్​ ప్రాంతంలో వందలాదిమంది గాయపడ్డారు.

2020 ఫిబ్రవరిలో 5.7 తీవ్రతతో నమోదైన భూకంపం.. ఇరాన్​ను వణికించింది. హబాష్​ ఈ ఓల్యా ప్రాంతంలో సంభవించిన భూకంపం ధాటికి 9మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.

ఇక 1990లో 7.4 తీవ్రతతో ఇరాన్​లో సంభవించిన భూకంపాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నార. ఆ ఘటనలో 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3లక్షలమంది గాయపడ్డారు. 5లక్షలకుపైగా మంది నిరాశ్రయులయ్యారు.

'భూకంపాల' ప్రపంచం..!

ప్రపంచంలో భూకంపాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. నేపాల్​, ఇండోనేషియా ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతూ అక్కడి ప్రజలు జీవిస్తున్నారు.

నేపాల్​లో ఈ నెల 24న భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 5.8గా నమోదైంది. భారత్​లోని ఉత్తరాఖండ్​లో పితోరగఢ్​కు తూర్పుగా 148 కిమీల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఫలితంగా ఉత్తరాఖండ్​లోని పలు ప్రాంతాలతో పాటు ఢిల్లీలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూమిలో 10 కిమీల లోతున సంభవించిన ఈ భూకంపం కారణంగా ఉత్తర్​ ప్రదేశ్, బిహార్​లలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం