Toll tax hike : భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారులపై మరింత భారం!
05 March 2023, 16:25 IST
- Toll tax to increase : దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల్లో టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీగా పెరగనున్న టోల్ ట్యాక్స్.. వాహనదారులపై మరింత భారం!
Toll tax to increase : భారతీయులపై మరో పిడుగు పడనుంది! దేశవ్యాప్తంగా త్వరలోనే టోల్ ఛార్జీలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల్లో.. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలను 5శాతం నుంచి 10శాతం వరకు పెంచే యోచనలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఉన్నట్టు సమాచారం.
5శాతం నుంచి 10శాతం వరకు..
2008 నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ ప్రకారం.. ప్రతి యేటా ఏప్రిల్ 1న.. టోల్ ఛార్జీలను సవరించాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు టోల్ ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదనపై.. కేంద్ర రోడ్డు, రవాణాశాఖ.. ఈ నెల చివర్లో ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కార్లు, లైట్ వెయిట్ వాహనాల టోల్ ఛార్జీలు కనీసం 5శాతం పెరిగే అవకాశం. ఇక హెవీ వెహికిల్స్‌కి అయితే టోల్ ఛార్జీలు కనీసం 10శాతం వరకు పెరగొచ్చు.
Toll charges increased : ఇటీవలే లాంచ్ అయిన ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపైన కూడా టోల్ ఛార్జీలు పెరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే.. కిలోమీటరుకు రూ. 2.19 చొప్పున టోల్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో 10శాతం వరకు పెరగొచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై తిరుగుతున్న వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 20వేల వాహనాలు.. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఉపయోగించుకుంటున్నాయి. ఆరు నెలల తర్వాత ఈ సంఖ్య 50వేలు- 60వేలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఢిల్లీ- మీరట్ ఎక్స్ప్రెస్వేపైనా టోల్ ఛార్జీలు పెరగనున్నాయి.
ఆ పాస్ ధరలు కూడా..
టోల్ ప్లాజ్లకు కనీసం 20 కి.మీల రేంజ్లో నివాసముండే వారికి నెలవారీ పాస్‌లు ఇస్తుంటారు. కాగా.. ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు కూడా కనీసం 10శాతం పెరగొచ్చు. 2022-23 ఆర్థిక ఏడాదిలో ఇది రూ. 315గా ఉంది.
Toll tax hike latest news : దేశంలో గత కొంతకాలంగా అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగపోయినప్పటికీ.. అనేక ప్రాంతాల్లో అవి ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు టోల్ ఛార్జీలను కూడా పెంచుతున్నారన్న వార్తలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.