TSRTC Sankranti Buses: ఇక ఆగేది ఉండదు.. టోల్ ప్లాజాల వద్ద TSRTC బస్సులకు ప్రత్యేక లేన్
Separate lanes for TSRTC buse: సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్‌ప్లాజాల వద్ద భారీగా రద్దీ ఉంటుంది. ఫలితంగా గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉండకుండా ప్రయాణికులకు కోసం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్ ఉండేలా చర్యలు తీసుకుంది.
Separate lanes for TSRTC buses at toll plazas:సంక్రాంతి... పండగ వచ్చిందంటే పట్నం అంతా ఖాళీ కావాల్సిందే అన్నట్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండగ కోసం ప్రజలంతా తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇందుకోసం ముందస్తుగానే ప్రణాళికలు వేసుకుంటారు. చాలా మంది ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణమవుతుంటారు. ఇక బస్సుల్లో ముందస్తు టికెట్లు బుక్ చేసుకునే వారు ఉంటారు. ఇలా లక్షలాది మంది ఒకేసారి వెళ్లే క్రమంలో... రోడ్లపై విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక జాతీయ రహదారులు, టోల్ ప్లాజాల వద్ద పరిస్థితి ఒక్క మాటలో చెప్పలేం. ఒక్కోసారి గంటల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి బస్సుల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టోల్ ప్లాజాకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంది. టోల్‌ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలకు లేఖ రాసింది. దీనికి ఆ రెండు శాఖలు అంగీకరించడంతో.. టోల్‌ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ కేటాయించనున్నారు. ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్ కేటాయించడంతో.. బస్సుల్లో ప్రయాణించేవారికి టోల్‌ప్లాజాల వద్ద గంటలకొద్ది వేచి ఉండే సమస్య తప్పుతుంది. ఫలితంగా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ నెల 12 నుంచి 14వరకు టోల్‌ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ కేటాయించనున్నారు. అన్ని టోల్‌గేట్ల వద్ద మూడు షిప్ట్‌ల్లో సిబ్బందిని ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది.
ఇబ్బంది పడకంది...
"ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్లి టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బంది పడే బదులు.. ఆర్టీసీ బస్సుల్లో త్వరగా మీ ప్రాంతాలకు చేరుకోండి" అంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో కోరారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఇదిలా ఉంటే ఈసారి 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. మరోవైపు ఏపీ ఆర్టీసీ 6400 ప్రత్యేక బస్సులను సంక్రాంతికి నడపనుంది. ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకునే వారికి రాయితీలు కూడా ప్రకటించాయి ఆయా సంస్థలు.