TSRTC Sankranti Special Buses: సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు.. చార్జీల్లో పెంపు లేదు
TSRTC Special Buses For Sankranti: సంక్రాంతి కోసం ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
tsrtc spceial buses for sankranthi festival: సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లే వారు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది తెలంగాణ ఆర్టీసీ. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. పండగ కోసం ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు బస్సు చార్జీల టికెట్లపై ఎలాంటి పెంపు ఉండదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్ఫష్టం చేశారు. సాధారణ చార్జీలతోనే నడుపుతున్నట్టు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో అధికారులతో సమీక్షించిన ఆయన... పలు వివరాలను వెల్లడించారు.
ప్రత్యేక బస్సులు...
ఈ సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ఆర్టీసీ. జనవరి 7 నుంచి 14 వరకు నడపాలని నిర్ణయించినట్టు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురానికి 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరుకు 20 బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి నుంచి బస్సులు బయలుదేరుతాయని వివరించారు. ఏపీ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకొన్న వారికి తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికులకు సేవలు అందించేందుకు హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు.
ఏపీలో కూడా...
మరోవైపు సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది ఏపీఆర్టీసీ. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇక ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. గత దసరా సీజనుకు నడిపిన స్పెషల్స్‌కు కూడా ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయకుండానే నడిపింది. అది ప్రయాణికుల ఆదరణను చూరగొనడంతో ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదే మాదిరిగా నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఊరట కలిగించనుంది.ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్టును https://apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు.