Sankranti Special Buses సంక్రాంతి పండుగ ప్రయాణాల కోసం విజయవాడ ఆర్టీసీ రీజియన్ పరిధిలో వెయ్యి బస్సుల్ని నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. జనవరి ఆరో తేదీ నుంచి 18 తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.,ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అరవయ్యేళ్లకు పైబడిన వారికి డిజిటల్ ఆధార్ కార్డు చూపిస్తే 25శాతం రాయితీ కల్పించనున్నారు. వయసు ధృవీకరణ చూపించిన వారికి టిక్కెట్లపై 25శాతం వరకు రాయితీ కల్పించనున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల సౌకర్యార్ధం జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు 50ప్రత్యేక బస్సుల్ని హిందూపురం, రాయదుర్గం, కదిరి, అనంతపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, కర్నూలు, నంద్యాల, గుంతకల్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని నడుపనున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్ధులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పండుగ సెలవుల కోసం వారికి ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసి ఏర్పాటు చేస్తోంది. ,హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాకు వెళ్లేందుకు కనెక్టివిటీ బస్సుల్ని సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాలకు అదనపు బస్సుల్ని తిప్పనున్నారు. ప్రయాణికులు రానుపోను రెండు వైపులా ప్రయాణాలకు ఒకేసారి టిక్కెట్ కొనుగోలు చేస్తే ప్రయాణ ఛార్జీలలో పదిశాతం రాయితీ కల్పించనున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఈ వాలెట్ ద్వారా బుక్ చేసుకునే టిక్కెట్లపై ఐదు శాతం రాయితీ కల్పించనున్నారు. ప్రయాణికులు టిక్కెట్లను www.apsrtconlince.in ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు సమీపంలోని రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చు.