TSRTC : పికప్ అండ్ డ్రాపింగ్ … IT ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
tsrtc bus services to IT companies in hyd: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు వివరాలను వెల్లడించింది.
TSRTC Latest News: విద్యార్థుల కోసం ఈ మధ్యే కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఐటీ ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ఈ బస్సు ఎక్కి నేరుగా తమ ఆఫీస్ దగ్గరకి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా విధులు ముగించుకుని ఆఫీస్ దగ్గర బస్సు ఎక్కి ఇంటి దగ్గర దిగవచ్చు.
ఈ ప్రాంతాలు ఎంపిక..
ఐటీ ఉద్యోగులకు ప్రత్యేకించిన ఈ సర్వీసులను ఎంపిక చేసిన ప్రదేశాల నుంచి ప్రస్తుతానికి హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐటీ సంస్థల వరకు నడపాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఈ సర్వీసులపై ఆసక్తి ఉన్న వారు డిసెంబరు 5వ తేదీలోగా ఆన్‌లైన్ సర్వేలో తమ వివరాలను నమోదు చేయాలని ఓ ప్రకటనలో కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ తీసుకొనేలా షీట్స్ ను అందుబాటులో తీసుకొచ్చింది.
ఈ ఆన్‌లైన్ సర్వేలో ఉద్యోగి పేరు, పని చేస్తున్న సంస్థ, పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్‌తోపాటు పికప్ టైమింగ్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశంలో ఐటీ ఉద్యోగుల సూచనలను కూడా స్వీకరిస్తుంది. ఇక, ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందిస్తుంది. టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్ వంటి ఆప్షన్స్‌ను యాప్‌లో ఇస్తుంది. అన్నీ కుదిరితే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేకించిన ఈ బస్సు సేవలు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీసులకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు 040 -23450033, 040-69440000 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించింది.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ ఆన్ లైన్ సర్వే ద్వారా ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు
ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో కొత్తగా 1020 సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తోంది టీఎస్ఆర్టీసీ(TSRTC). ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరికొన్ని రోజుల్లో కొత్త బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ఈ కొత్త బస్సుల్లో సూపర్ లగ్జరీ(Super Luxury), ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) కూడా ఉన్నాయి. మెుత్తం 1020 బస్సులను ఆర్టీసీ తీసుకువస్తుంది.
మరో రెండు మూడు నెలల్లో ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చెందుకు ఆర్టీసీ(RTC) ప్లాన్ చేస్తోంది. ఈ బస్సుల్లో 720 బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు కాగా.., 300 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రతిపాదికన తీసుకురానున్నారు. తెలంగాణ(Telangana)లోని జిల్లాల్లో తిరిగి పాతబడిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాత బస్సులు మియాపూర్ బస్ బడీ బిల్డింగ్ లో మార్పు చేస్తారు. వాటిని సిటీ బస్సులుగా మార్చే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది.