ఆటపాటలతో వేడుకగా వృద్ధురాలి 'అంత్యక్రియలు'! చివరి కోరిక నెరవేర్చిన కుటుంబం..
20 December 2024, 13:40 IST
- తమిళనాడులో ఇటీవలో ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు పాటలు పాడారు, డ్యాన్స్‌లు వేశారు. చాలా సందడిగా, సంతోషంగా గడిపి అంత్యక్రియలు నిర్వహించారు! అదేంటి? ఎవరైనా చనిపోతే బాధపడాలి కదా? అనుకుంటున్నారా? వీరు ఇలా చేయడానికి కారణం ఉంది. అదేంటంటే..
ఇలా వృద్ధురాలి చివరి కోరికను నెరవేర్చిన కుటుంబం..
తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మరణించిన వృద్ధురాలికి, ఆమె కుటుంబం ఆటపాటలతో ఘనంగా అంత్యక్రియలు చేసింది! అయితే, దీని వెనుక ఒక కారణం ఉంది..
ఆటలు, పాటలతో అంత్యక్రియలు.. ఎందుకు?
తమిళనాడు మధురై జిల్లాలోని ఉసిలంపట్టి సమీపంలో జరిగిన ఈ ఘటన. చిన్నపలారపట్టి చెందిన పూజారి పరమదేవర భార్య పేరు నాగమ్మాల్. ఆమె భర్త 15ఏళ్ల క్రితం మరణించాడు. 96ఏళ్ల నాగమ్మాల్ ఇటీవలే కన్నుమూసింది. అయితే, మరణానికి ముందు ఆమె తన చివరి కోరికను కుటుంబసభ్యులతో పంచుకుంది.
“ఇతరుల్లాగా నా అంత్యక్రియలు బాధగా, దిగ్భ్రాంతిగా జరగకూడదు. అందరు సంతోషంగా, డ్యాన్స్‌లు వేయాలి. పాటలు పాడాలి. ఘనంగా వేడుకలు జరుగుపుకోవాలి,” అని ఆమె చెప్పింది. ఇక నాగమ్మాల్ మరణం తర్వాత, ఆమె కోరికను కుటుంబసభ్యులు నెరవేర్చారు.
నాగమ్మాల్కి మొత్తం ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమెకు చాలా మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. నాగమ్మాల్ అంత్యక్రియల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌కి వీరందరు తరలివెళ్లారు.
స్టేజ్ ఏర్పాటు చేశారు అందరు డ్యాన్స్‌లు చేశారు, పాటలు పాడారు. కుటుంబంలోని మహిళలు, బాలబాలికలు సైతం నృత్యం చేశారు. అనంతరం జానపద కళా కార్యక్రమం జరిగింది. అందరు సంతోషంగా అందులో పాల్గొన్నారు. సమీపంలోని ప్రజలు కూడా తరలివెళ్లారు.
ఒకానొక దశలో ఆ ప్రాంతం మొత్తం పాటలతో హోరెత్తిపోయింది. అక్కడ అంత్యక్రియల కార్యక్రమం జరగుతోందంటే ఎవరు నమ్మలేదు. కుటుంబసభ్యులతో పాటు అక్కడికి వెళ్లిన వారందరు సంతోషంగా సమయాన్ని గడిపారు.
నాగమ్మాల్ మనవళ్లు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. కానీ తమ దుఖాన్ని దిగమింగుకుని వృద్ధురాలి కోరికను నెరవేర్చడానికి కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అభినందిస్తున్నారు.
ఇక ఆట, పాటల కార్యక్రమాలు పూర్తైన తర్వాత, చివరికి నాగమ్మాల్కి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.