AP Birth Death Certificates : బర్త్, డెత్ సర్టిఫికేట్‌లు పొందేందుకు కొత్త వెబ్‌పోర్టల్-జనవరి 1 నుంచి అందుబాటులోకి
11 December 2024, 18:12 IST
AP Birth Death Certificates : జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వం నూతన పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది
బర్త్, డెత్ సర్టిఫికేట్‌లు పొందేందుకు కొత్త వెబ్‌పోర్టల్-జనవరి 1 నుంచి అందుబాటులోకి
AP Birth Death Certificates : బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ పొందేందుకు కొత్త వెబ్ పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ పోర్టల్ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ పొందడంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సరికొత్త వెబ్ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది.
కొత్త సంవత్సరంలో కొత్త వెబ్‌పోర్టల్‌లో జనన, మరణాల ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. 2025 జనవరి 1 నుంచి కొత్త వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్‌టీజీఎస్ అధికారులకు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ పొందడంలో ఉత్పన్నమవుతున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ కొత్త వెబ్‌పోర్టల్ ఉపయోగపడాలని సూచించారు. ఈ పోర్టల్‌ను పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో కొనసాగాలన్నారు.
వాట్సాప్ ఆధారంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
వాట్సాప్ ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికేట్లు ఏవైనా ఇచ్చే విధంగా వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలకు సేవలందాలని సీఎం చంద్రబాబు తెలిపారు. వీలైనంత త్వరగా మరో వెయ్యి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆధార్ సేవలను మరింత ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించారు. దీని కోసం వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించి రూ.20 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు.
ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ), డీప్‌టెక్ వంటి సాంకేతిక సేవలు వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా ఆ వినతులను, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డ్రోన్ల ద్వారా రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు. గంజాయి తోటలను గూగుల్ మ్యాప్‌ల ద్వారా, డ్రోన్ల సాయంతో గుర్తించి, వారిని ధ్వంసం చేయాలని అన్నారు.
రానున్న రోజుల్లో రైతులు పండించే పంటల తెగుళ్లను గుర్తించేందుకు కూడా డ్రోన్లు వినియోగిస్తామని అన్నారు. ఇటీవలి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎలా జరిగింది? సక్రమంగా జరిగిందా? లేదా? అనేది మరోసారి అధికారులు సరి చూసుకోవాలని అధికారాలకు సీఎం చంద్రబాబు సూచించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్